
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఏడాది క్రితం ప్రమాదవశాత్తు మృతి చెందిన యువకుడి మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల వెలికి తీసి తల భాగాన్ని అపహరించుకుపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన గ్రామస్తుల్లో భయాందోళనలకు కారణమవుతోంది.
ఇచ్చోడ మండలంలోని ఇస్లాంనగర్ గ్రామానికి చెందిన లాండ్గె వెంకట్ (19) గత సంవత్సరం నవంబర్ 19న వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. యువకుడి అకాల మరణంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. కుటుంబ సభ్యులు సంప్రదాయాల ప్రకారం వెంకట్ మృతదేహానికి తమ పొలంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే, ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఆ మృతదేహాన్ని పాతిపెట్టిన స్థలాన్ని తవ్వి వెలికి తీశారని తెలుస్తోంది. అక్కడ గుంత తీసిన ఆనవాళ్లు కనిపించడంతో మృతుడి సోదరుడు దీపక్ మంగళవారం పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం మృతదేహంలో తల భాగం కనిపించకపోవడంతో అది అపహరించబడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
గత ఆదివారం పుష్య అమావాస్య కావడంతో, మూఢనమ్మకాల నేపథ్యంలో తల భాగాన్ని తీసుకెళ్లి ఉండవచ్చనే చర్చ గ్రామంలో సాగుతోంది. ఈ ఘటనపై స్థానికులు భయంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.
ఈ విషయమై ఇచ్చోడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో బండారి రాజును వివరణ కోరగా, మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటన వెనుక ఉన్న అసలు కారణాలు, నిందితుల వివరాలను గుర్తించేందుకు అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.
ALSO READ: Heart Attack: లైట్ తీసుకోకండి.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే ప్రాణాలకే ముప్పు!





