
Office Romance: ఇటీవలి కాలంలో ఉద్యోగ స్థలాల్లో ప్రేమాయణాలు పెరుగుతున్నాయనే అంశంపై కొత్త సర్వే వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా 11 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆశ్చర్యంగా మారింది. Ashley Madison అనే ప్రసిద్ధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్, YouGov సంస్థతో కలిసి చేసిన ఈ అధ్యయనంలో ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, జర్మనీ, భారత్, ఇటలీ, మెక్సికో, స్పెయిన్, స్విట్జర్లాండ్, యుకె, యుఎస్ దేశాల నుంచి మొత్తం 13,581 మంది పాల్గొన్నారు. ఇందులో మెక్సికో 43 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, భారత్ 40 శాతంతో రెండో స్థానాన్ని సాధించింది. అంటే ప్రతి పది మంది భారతీయులలో నలుగురు తమ కార్యాలయంలోనే ప్రేమ సంబంధాలు కలిగి ఉన్నారని అంగీకరించారు.
ఈ అధ్యయనంలో ఆసక్తికరమైన విషయమేమిటంటే.. పురుషులలో 51 శాతం మంది సహోద్యోగులతో డేటింగ్ చేసినట్లు వెల్లడించగా, మహిళలలో ఇది 36 శాతం మాత్రంగానే ఉంది. దీని అర్థం పురుషులు మహిళలకంటే ఎక్కువగా ఆఫీస్ ప్రేమాయణాలకు పాల్పడుతున్నారని అర్థం. అయితే మహిళలు వృత్తి పరంగా తమ కెరీర్‌కి దెబ్బ తగులుతుందనే ఆందోళనతో ఇలాంటి సంబంధాలకు దూరంగా ఉండటం గమనార్హం. సర్వే ప్రకారం 29 శాతం మహిళలు, 27 శాతం పురుషులు కార్యాలయ ప్రేమల వల్ల కెరీర్ లేదా ప్రతిష్ట దెబ్బతింటుందనే భయంతో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
ఇక వయస్సు ఆధారంగా చూస్తే 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువ ఉద్యోగులు కార్యాలయ సంబంధాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉన్నారని ఈ అధ్యయనం పేర్కొంది. వీరిలో 34 శాతం మంది ఇలాంటి సంబంధాలు తమ భవిష్యత్‌పై ప్రతికూల ప్రభావం చూపవచ్చని భావిస్తున్నారు. మరోవైపు Gleeden అనే డేటింగ్ యాప్ నిర్వహించిన సర్వేలో కూడా భారత్‌లో వివాహేతర సంబంధాల పెరుగుదల ఆందోళన కలిగించే స్థాయిలో ఉందని తేలింది. భారతీయులలో 35 శాతం మంది ప్రస్తుతం ఓపెన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారని, 41 శాతం మంది తమ భాగస్వామి అనుమతిస్తే అలాంటి సంబంధాన్ని పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొన్నారు.
ఇది కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాకుండా చిన్న పట్టణాలకూ విస్తరిస్తోందని సర్వేలో తేలింది. తమిళనాడులోని కాంచీపురం పట్టణం ఇలాంటి వివాహేతర సంబంధాలపై ఆసక్తి ఎక్కువగా చూపిస్తున్న ప్రాంతంగా నిలిచింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వృత్తి ఒత్తిడులు, ఎక్కువ సమయం ఆఫీస్‌లో గడపడం, సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఈ ధోరణి వేగంగా పెరుగుతోందని చెబుతున్నారు. సమాజంలో విలువలు, వ్యక్తిగత పరిమితుల మధ్య సరిహద్దులు మసకబారుతున్నాయని వారు పేర్కొంటున్నారు.
ALSO READ: Technology: మరింత స్మార్ట్‌గా మారిన ChatGPT.. OpenAI నుంచి కొత్త GPT-5.1 విడుదల





