తెలంగాణ

జూబ్లీహిల్స్‌లో ముగిసిన నామినేషన్ల పర్వం, జోరందుకున్న ప్రచార పర్వం

  • రికార్డు స్థాయిలో 150కి పైగా నామినేషన్లు దాఖలు

  • రేపు నామినేషన్ల పరిశీలన, ఎల్లుండి ఉపసంహరణ

  • ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా జూబ్లీహిల్స్‌ గెలుపు

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారిన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కీలక ఘట్టం ముగిసింది. ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు నామినేషన్ల పర్వం పూర్తయింది. అయితే, ఆర్వో ఆఫీసు గేటు లోపల ఉన్నవారికి నామినేషన్‌ వేసేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు వారికి ఎన్నికల అధికారులు టోకెన్లు జారీ చేశారు.

భారీగా నామినేషన్లు దాఖలు

నామినేషన్ల చివరి రోజు జూబ్లీహిల్స్‌లో భారీగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 150కి పైగా నామినేషన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రధాన రాజకీయ పార్టీలే కాకుండా, స్వతంత్ర అభ్యర్థులు, ట్రిపుల్‌ ఆర్‌ బాధిత రైతులు, ఫార్మా బాధి రైతులు, నిరుద్యోగులు, పలువురు ఓయూ విద్యార్థులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌ నుంచి నవీన్‌ యాదవ్‌, బీఆర్ఎస్‌ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్‌ రెడ్డి నామినేషన్లు వేశారు.

రేపు నామినేషన్ల పరిశీలన, ఎల్లుండి ఉపసంహరణ

దాఖలైన నామినేషన్లను రేపు పరిశీలించనున్నారు అధికారులు. ఎల్లుండి ఉపసంహరణ కోసం అవకాశమిచ్చారు. వచ్చేనెల 11న జూబ్లీహిల్స్‌ నియోజకవర్గ ఉప ఎన్నిక జరగనుంది. 14వ తేదీన కౌంటింగ్‌ జరగనుంది.

జోరందుకున్న ప్రచార పర్వం

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని మూడు ప్రధాన పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. రానున్న పంచాయతీ ఎన్నికలకు జూబ్లీహిల్స్‌ గెలుపు గీటురాయి కానుంది. జూబ్లీహిల్స్‌లో గెలిచి… ధైర్యంగా లోకల్‌ బాడీ ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇక్కడ ఓటమిపాలైతే… రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌పై నెగిటివిటీ ప్రచారమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరోవైపు సిట్టింగ్‌ సీటును కాపాడుకోవాలనే పట్టుదలతో బీఆర్‌ఎస్‌ ముందుకెళ్తోంది. మాగంటి సునీతను పోటీలో నిలిపి సానుభూతి పొందేందుకు ప్రయత్నిస్తోంది. అంతే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం నెలకొన్న అసంతృప్తి జ్వాలను జూబ్లీహిల్స్‌లో రగిలించాలని చూస్తోంది. ఈ రెండు పార్టీలతో పాటు బీజేపీ కూడా జూబ్లీహిల్స్‌లో కమలం జెండాను ఎగురవేయాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా అన్ని పార్టీలు ప్రచార పర్వంలో ముందుకు దూసుకెళ్తున్నాయి. ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు యత్నిస్తున్నారు.

ఇవీ చదవండి

  1. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఓకే… ప్రచారంలో బీజేపీ స్పీడ్ పెంచుబోతుందా?
  2. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గుందా అంటూ మండిపడ్డ కేటీఆర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button