విజయవాడ, క్రైమ్ మిర్రర్: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీలో ఎన్డీయే ఎంపీలతో కలిసి ఆయన ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి శాలువా కప్పి ఏపీ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ భేటీ అనంతరం లోకేశ్ ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ “అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసి, ఏళ్ల తరబడి నిలబడిన రైతుల అసాధారణ గాథను ప్రధానికి వివరించినట్లు వారి త్యాగాలను గౌరవిస్తూ, అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు ఆయన మార్గనిర్దేశం కోరాను” అని పేర్కొన్నారు.
అనంతరం లోకేశ్, ఇతర ఎంపీలు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా కలిసి బిల్లు ఆమోదానికి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. లోకేశ్ వెంట కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2026 బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది.. ఎగువ సభలోనూ ఇది ఏకగ్రీవంగా ఆమోదం పొందింది ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకే లోకేశ్ ఢిల్లీ పర్యటనకు వచ్చారు. 2014 నాటి పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5ను సవరిస్తూ.. ‘కొత్త రాజధాని’ అనే పదం స్థానంలో ‘అమరావతి కొత్త రాజధానిగా ఉంటుంది’ అని ఈ బిల్లు స్పష్టం చేస్తోంది. తన పర్యటనలో భాగంగా లోకేశ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌ను కూడా కలిసినట్లు ఆయన పేర్కొన్నారు.
