
Nagarjuna Sagar Left Canal Water Release: ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా నదికి వరదల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే శ్రీశైలం జలాశయం నిడడంతో కొద్ది రోజుల పాటు గేట్లు ఎత్తి సాగర్ కు నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం విద్యుత్ తయారీ ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. సాగర్ లోకి వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఎన్నెస్పీ అధికారులు ఎడమ కాలువకు నీటి విడుదల చేశారు. 1000 క్యూసెక్కుల నీటిని వదిలారు. నెమ్మదిగా ఈ నీటి విడుదలను 2 వేల క్యూసెక్కులకు పెంచనున్నట్లు తెలిపారు.
చాలా రోజులుగా నీటిని విడుదల చేయాలని కోరుకున్న రైతులు
ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతులు నీటి విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. తాగునీటి కోసమే కాకుంగా పంటల సాగుకు కూడా నీటి విడుదల చేయాలని ఆయకట్టు రైతులు కోరారు. ఈ నేపథ్యంలో సాగర్ నుంచి నీటి విడుదల కావడంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారు పోసుకోగా, ఇక పొలాలు తడిపి నాట్లు వేయబోతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి అవసరాలకు అనుగుణంగా పాలేరు జలాశయం నింపనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకూ 1.7 టీఎంసీల నీరు విడుదల చేసినా.. పాలేరు జలాశయం నిండలేదు. తాగు నీటికి ఇబ్బందులు తలెత్తకుండా నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎడమ కాల్వకు మరోసారి నీరు విడుదల చేశామని అధికారులు తెలిపారు. ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో పోసిన నారు మడులు ఎండిపోకుండా రైతులు ఈ నీటిని వాడుకోవచ్చునన్నారు. ప్రతి రోజూ 2,000 క్యూసెక్కుల చొప్పున పాలేరు జలాశయం నిండేవరకు నీటిని విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
సాగర్ లో నీటి నిల్వ ఎంత ఉందంటే?
నాగార్జున సాగర్ జలాశయం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 565 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా..ప్రస్తుత నీటి నిల్వ 245టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 98,293 క్యూసెక్కులు కాగా..అవుట్ ఫ్లో 31,876క్యూసెక్కులు, జల విద్యుత్తు కేంద్రంలో ఉత్పత్తి కొనసాగిస్తున్నారు. సాగర్ నుంచి ఎడమ కాల్వ ద్వారా 2,258 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 1,800 క్యూసెక్కులు మొత్తం 4,058 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Read Also: 12 జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ!