Murder: సోషల్ మీడియాలో సరదాగా పంచుకునే ఒక ఫోటో, ఒక చిన్న వీడియో ఎంతటి విషాదానికి దారితీస్తుందో హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన గర్భిణి హత్య ఉదంతం మరోసారి స్పష్టంచేసింది. గృహహింస చట్టం కింద నమోదైన కేసుతో తన జీవితం ఛిద్రమైందని భావించిన మహేష్ ప్రతీకారంతో విదేశాల నుంచి వచ్చి పథకం ప్రకారం మాజీ భార్య సునీతను హత్య చేసిన తీరు సంచలనంగా మారింది. వ్యక్తిగత విభేదాలు, అనుమానాలు, ఆవేశాలు కలిసివచ్చినప్పుడు అవి ఎంతటి దారుణాలకు దారి తీస్తాయో ఈ ఘటన భయానక ఉదాహరణగా నిలిచింది.
పెద్దపల్లి జిల్లాకు చెందిన దేవరకొండ మహేష్ 2019 నుంచి 2022 వరకు ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసి అనంతరం కెనడాకు వెళ్లాడు. మహారాష్ట్ర రాష్ట్రంలోని చంద్రపురి జిల్లా బల్లార్పూర్ మండలం తిలక్‌వాడకు చెందిన సునీతతో 2014లో పరిచయం ప్రేమగా మారింది. 2022 ఏప్రిల్‌లో ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సునీతకు వీసా రాకపోవడంతో మహేష్ ఒక్కడే కెనడాకు వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత భార్యతో సంభాషణలు తగ్గించడంతో అనుమానాలు పెరిగాయి. 2023 అక్టోబరులో సునీత కెనడాకు వెళ్లినా వివాదాలు మరింత ముదిరాయి. కొద్ది నెలలకే భారత్‌కు తిరిగొచ్చిన ఆమె భర్తపై గృహహింస కేసు నమోదు చేసింది. ఈ కేసులో మహేష్‌తో పాటు అతని తల్లిదండ్రుల పేర్లు కూడా చేర్చబడ్డాయి.
ఈ పరిణామాల తర్వాత మహేష్ తల్లి మరణించగా, లుక్ ఔట్ నోటీసుల కారణంగా అతని వీసా సమస్యల్లో పడింది. తనపై తప్పుడు కేసులు పెట్టి జీవితాన్ని నాశనం చేసిందనే భావనతో సునీతపై అతనిలో తీవ్ర కక్ష పెరిగినట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో సునీత మరో వ్యక్తితో కలిసి కొత్త జీవితం ప్రారంభించి గర్భిణిగా ఉన్నట్లు తెలిసి అతని ఆవేశం మరింత పెరిగింది. ఆమె ఇంటి అడ్రెస్‌ను గుర్తించేందుకు మహేష్ వెతకడం ప్రారంభించాడు. సోషల్ మీడియాలో సునీత పంచుకున్న ఒక వీడియోలో కనిపించిన ఆలయ దృశ్యాన్ని ఆధారంగా తీసుకుని అది వనస్థలిపురం ప్రాంతమని గుర్తించినట్లు దర్యాప్తులో తేలింది. అక్కడ గాలించి చివరకు ఆమె నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ను గుర్తించాడు.
హత్యకు ముందే ప్రణాళిక సిద్ధం చేసుకున్న మహేష్ తన సంచిలో కత్తి, విద్యుత్ రంపాలు, పెట్రోలు డబ్బా వంటి సామగ్రిని తెచ్చుకున్నాడు. తలుపులు మూసివేసి ఉంటే రంపాతో కోసి లోపలికి వెళ్లాలని, ఎవరైనా అడ్డొస్తే పెట్రోలు చల్లి బెదిరించాలని భావించినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం ఇంట్లోకి చొరబడి సునీతపై దాడి చేసి హత్య చేశాడు. ఘటన సమయంలో ఆమె 2 నెలల గర్భిణిగా ఉన్నట్లు సమాచారం. అనంతరం స్థానికుల సహకారంతో మహేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సంచిని తనిఖీ చేసినప్పుడు బయటపడిన ఆయుధాలు చూసి పోలీసులు సైతం ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం.
ఒకప్పుడు మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు అవసరమనే చర్చ కొనసాగింది. ప్రస్తుతం చట్టాల అమలు, వాటి దుర్వినియోగం, కుటుంబ విభేదాలు, పరస్పర అనుమానాలు సమాజంలో తీవ్ర పరిణామాలకు దారితీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాలను నాశనం చేసిందని, ఒక ప్రాణంతో పాటు గర్భంలోని శిశువు ప్రాణం కూడా కోల్పోయినట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతీకారం చివరికి జీవితాలను చీకట్లోకి నెట్టేస్తుందని ఈ ఘటన స్పష్టంచేసింది.
ALSO READ: దారుణం.. 3 నెలలుగా బాలికపై తండ్రి అత్యాచారం
