మాట ఇచ్చాం మడమ తిప్పం అంటూ లోకల్ కామ్రేడ్ నాయకులు ఒక వైపు గట్టిగా నిలబడుతుంటే, మరోవైపు కాంగ్రెస్‌తో కలిస్తేనే భవిష్యత్ లాభమంటూ పార్టీ అదిష్టానం సూచనలు ఇస్తుండటంతో క్యాతన్‌పల్లి పురపాలక రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఇప్పటికే జరిగిన పరిణామాల తర్వాత వెనక్కి తగ్గితే ప్రజల్లో చులకన అవుతామనే భావన స్థానిక ఎర్రన్నల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భవిష్యత్ అవసరాల కోసం ఒక అడుగు వెనక్కి వేయడంలో తప్పేమీ లేదనే వాదనతో పైస్థాయి నాయకత్వం ఆలోచనలో ఉంది.
టికెట్ల పంపకాల దశ నుంచి నామినేషన్లు, ఎన్నికల ప్రచారం నుంచి ఫలితాల విడుదల, అక్కడి నుంచి చైర్మన్ ఎన్నిక వరకు క్యాతన్‌పల్లి కథ ట్విస్టుల మీద ట్విస్టులతో సాగుతోంది. 22 వార్డులు మాత్రమే ఉన్న ఈ పురపాలక సంఘం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సింగరేణి కార్మిక వర్గం బలంగా ఉన్న ఈ ప్రాంతంలో కామ్రేడ్‌లకు గట్టి పట్టు ఉండటంతో సీపిఐతో పొత్తు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలూ ప్రయత్నించాయి. అయితే చర్చలు విఫలమవడంతో సీపిఐ చివరకు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపింది. అదే కాంగ్రెస్‌కు తొలి దెబ్బగా మారింది.
ఫిబ్రవరి 11న జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ సీపిఐ మద్దతుతో 14 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 7 స్థానాలకు పరిమితమైంది. మెజారిటీ స్పష్టంగా రావడంతో చైర్మన్ ఎన్నిక లాంఛనమేనని భావించారు. కానీ పరిణామాలు ఊహించని మలుపులు తీసుకున్నాయి. ఫిబ్రవరి 16న జరగాల్సిన కౌన్సిల్ సమావేశానికి బయలుదేరిన బీఆర్ఎస్, సీపిఐ నేతలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాల్సి వచ్చింది.
మొదటి రోజు కోరం లేకపోవడంతో మరుసటి రోజు మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే రెండో రోజూ ఉద్రిక్తత తగ్గలేదు. బీఆర్ఎస్ నేతలు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఎంట్రీతో పరిస్థితి మరింత వేడెక్కింది. మంత్రి వివేక్ కాన్వాయ్ రాకతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పెరిగి లాఠీచార్జ్ వరకు వెళ్లింది. రాళ్ల దాడిలో మంత్రి కాన్వాయ్‌కు నష్టం వాటిల్లగా, పలువురు గాయపడ్డారు. కేసులు, అరెస్టులు చోటుచేసుకున్నాయి.
దీంతో ఫిబ్రవరి 18న బీఆర్ఎస్ క్యాతన్‌పల్లి బంద్‌కు పిలుపునిచ్చింది. అదే రోజు బాల్క సుమన్ అరెస్ట్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మద్దతివ్వడం స్థానిక కామ్రేడ్ నాయకులకు కష్టంగా మారింది. ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలా, లేక వ్యూహాత్మక నిర్ణయం తీసుకోవాలా అనే సందిగ్ధంలో సీపిఐ నిలిచింది. పైస్థాయి నాయకత్వం మాత్రం ఈ రాజకీయ సంక్షోభానికి త్వరగా ముగింపు పలకాలని భావిస్తోంది.
ఇదిలా ఉండగా కామ్రేడ్ కౌన్సిలర్లకు భారీ ఆఫర్లు ఉన్నాయన్న ప్రచారం జిల్లాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న నేపథ్యంలో మరింత ఉద్రిక్తత పెరగకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. బాల్క సుమన్ తాను జైలుకెళ్లినా విజయం ఆపలేరని స్పష్టం చేస్తున్నారు.
ఇప్పుడు బంతి ఎన్నికల కమిషన్ కోర్టులో ఉంది. తదుపరి నిర్ణయం ఏ దిశగా ఉంటుందన్నదే అందరి దృష్టి. క్యాతన్‌పల్లి రాజకీయ రణరంగానికి ఎండ్ కార్డ్ ఎప్పుడు పడుతుందో చూడాల్సి ఉంది.
ALSO READ: AI సమ్మిట్‌లో నిరసన.. సుంకాల తగ్గింపుపై వివాదం, రాహుల్ గాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత
