గ్యాస్ కల్లోలానికి ప్రధాన మంత్రి వ్యాఖ్యలే కారణం?
కరోనా తరహా సంక్షోభం ఎదురవుతోందన్న మోదీ
తీవ్ర ఆందోళనకు గురైన వాహనదారులు
పెట్రోలు బంకుల్లో భారీ సంఖ్యలో బారులు
బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు.. కొన్నిచోట్ల తాళం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: హైదరాబాద్‌లో పెట్రోలు బంకులకు తాళం వేస్తున్నారు. కొన్ని బంకుల్లో తాళం వేయకపోయినా.. `నో స్టాక్` బోర్డులు పెడుతున్నారు. దీంతో ద్విచక్ర వాహనదారుల నుంచి కార్ల యజమానుల వరకు తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నారు. తెరిచి ఉంచిన బంకుల వద్ద పెద్దసంఖ్యలో వాహనాలతో బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితి హైదరాబాద్ లో మాత్రమే కాదు.. దేశ రాజధాని ఢిల్లీ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, యుద్ధంపై అమెరికా దోబూచులాడడం, మరోవైపు.. అమెరికా ఆగినా.. తాము మాత్రం యుద్ధాన్ని ఆపేది లేదని ఇజ్రాయెల్ ప్రకటించడం, యుద్ధం కొనసాగుతుండడంతో సహజంగా చమురు రవాణా వ్యవస్థలు ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. మరోవైపు.. చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పెరిగిపోయింది. దీంతో పాకిస్థాన్ సహా పలు దేశాలు.. చమురును కొనుగోలు చేయడం మానేశాయి. అంతేకాదు.. వాటిపై ఇస్తున్న రాయితీలను కూడా నిలిపివేశాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం నెలకొంది. అయితే.. ఈ విషయంలో భారత్ కొంత మెరుగ్గానే ఉందని చెప్పవచ్చు. గల్ఫ్ దేశాలకు ప్రత్యామ్నాయంగా అర్జెంటీనా సహా. రష్యా వంటి కీలక చమురు ఉత్పత్తి దేశాల నుంచి భారీ ఎత్తున చమురును భారత్ కొనుగోలు చేస్తోంది. అదే సమయంలో చమురు నిక్షేపాలను ఇంకా వెలికి తీయలేదు. ఒకరకంగా చూసుకుంటే.. మనకు వచ్చే నాలుగు నెలల వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేని విధంగానే చమురు నిల్వలు, గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి.
ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితులపై ఆందోళన చెందుతున్న సమయంలో మన దేశంలో పరిస్థితి సానుకూలంగా ఉన్నా.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం పార్లమెంటులో ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసే ప్రకటనలు చేశారు. పశ్చిమాసియా యుద్దం, మన దేశంలో పరిస్థితులను వివరిస్తూ మంగళవారం పార్లమెంటులోమాట్లాడిన ప్రధాని.. ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలదరూ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్నారు. అంతేకాకుండా.. ప్రసుతం మనకు కరోనా నాటి పరిస్థితులు ఎదురవుతున్నాయని వ్యాఖ్యానించారు. ప్రధాని చేసిన ఈ రెండు వ్యాఖ్యలు.. దేశ ప్రజలపై తీవ్ర ప్రభావం చూపించాయి. ప్రజలంతా ఆందోళనకు గురై ఎప్పుడు, ఏ క్షణంలో, ఏం జరుగుతుందోనన్న ఉద్దేశంతో పెట్రోల్ బంకుల ముందు, గ్యాస్ డీలర్ల ముందు క్యూ కట్టారు. ఇక, ఆయా బంకుల యజమానులు కూడా .. ప్రస్తుతం బ్లాక్‌లో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మరికొందరు నిల్వలను దాచిపెడుతున్నారు.
ఓవైపు ఇరాన్ తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గుతున్న పరిస్థితులు ఉండగా.. మోదీ మాత్రం ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి బదులు ఆందోళన కలిగించేలా వ్యవహరించారు. దీంతో నష్టనివారణ చర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం వెంటనే.. దేశంలో పెట్రోల్, గ్యాస్ సంక్షోభం లేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రకటన చేసింది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని నిల్వలు ఉన్నాయని ప్రకటించింది. ఈ ప్రకటన తరువాత ప్రజల్లో మార్పు వస్తుందా? అన్నది వేచిచూడాల్సి ఉంది.
