Thursday, February 19, 2026
Homeతెలంగాణక్యాతనపల్లి మున్సిపాలిటీలో 'నోట్ల' రాజకీయం, ఖరీదైన కారు ఎర..?

క్యాతనపల్లి మున్సిపాలిటీలో ‘నోట్ల’ రాజకీయం, ఖరీదైన కారు ఎర..?

  • గెలిచిన బిఆర్ఎస్ సీపిఐఅభ్యర్థులకు అధికార పార్టీ గాలం
  • బంధుమిత్రులతో ఫోన్లు చేయించి ప్రలోభాలు
  • -ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ విపక్షాల మండిపాటు-

రామకృష్ణాపూర్ ఫిబ్రవరి 19 (క్రైమ్ మిర్రర్): క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ‘సామ దాన భేద దండోపాయాలను’ ప్రయోగిస్తోంది. ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన బీఆర్ఎస్, సీపీఐ ఉమ్మడి కూటమి కౌన్సిలర్లను తమవైపు తిప్పుకునేందుకు భారీ ఆఫర్లతో వల విసురుతోంది. గెలిచిన అభ్యర్థులను నేరుగా ఒప్పించలేక, వారి కుటుంబ సభ్యులు,బంధువుల ద్వారా రాయబారాలు నడుపుతుండటం ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది.

బంధువుల ద్వారా ‘కోట్ల’ బేరసారాలు

విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ ముఖ్య నేతలు రంగంలోకి దిగి, గెలిచిన అభ్యర్థుల అత్యంత సన్నిహితులు, బంధువులను గుర్తించి వారి ద్వారా ఫోన్ చేయిస్తున్నారు. “మీ వాడు మాకు సపోర్ట్ చేస్తే చాలు.. అడిగినంత ఇస్తాం” అంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో అభ్యర్థికి కోటి రూపాయల నగదు తో పాటు, అదనంగా ఒక ఖరీదైన కారును బహుమతిగా ఇస్తామని ఆశ చూపుతున్నట్లు తెలుస్తోంది.

కుటుంబ సభ్యులపై ఒత్తిడి.. ఫోన్లతో వేధింపులు

కేవలం డబ్బు మాత్రమే కాకుండా, అధికార పార్టీలో చేరితేనే వార్డుల అభివృద్ధి జరుగుతుందని, లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థుల కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అభ్యర్థుల భార్యలు, తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి.. “ఈ ఒక్క అవకాశం వదులుకోవద్దు, మీ భవిష్యత్తు మారిపోతుంది” అంటూ బంధువుల చేత ఒత్తిడి తీసుకొస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తోంది.

ప్రజా తీర్పును కాలరాస్తున్నారా?

ప్రజలు బీఆర్ఎస్, సిపిఐ కూటమికి స్పష్టమైన తీర్పునిచ్చినా, ధనబలంతో కౌన్సిలర్లను కొనుగోలు చేసి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూడటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన వారిని ప్రలోభపెట్టడం అంటే ఓటర్లను అవమానించడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు, అధికార పార్టీ ఎరలకు చిక్కకుండా బీఆర్ఎస్ ,సీపిఐనేతలు తమ అభ్యర్థులను అప్రమత్తం చేశారు. ఇప్పటికే పలువురు కౌన్సిలర్లు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకుని పార్టీ ఆదేశాల మేరకు క్యాంపులకు వెళ్లినట్లు సమాచారం. ఈ ‘ఆపరేషన్ ఆకర్ష్’ వ్యవహారం క్యాతనపల్లిలో రాజకీయ సెగలను పెంచుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments