రైతు భరోసా పథకానికి షరతులు, నిబంధనలు విధిస్తూ సీఎం రేవంత్ రెడ్డి అన్నదాతకు సున్నం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వంకుంట్ల కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా పథకం అమలుకు నిబంధనలను పెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. రైతులకు షరతులు విధించడమేంటని ప్రశ్నించారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ప్రభుత్వాన్ని అడుక్కోవాలా అని నిలదీశారు. ఎటువంటి నిబంధనలను విధించకుండా బేషతరుగా రైతులందరికీ రైతు భరోసా నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా పథకానికి కూడా దరఖాస్తులను స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడం దారుణమని అన్నారు. ఇప్పటికే ప్రజా పాలన దరఖాస్తుల పేరిట ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ కవిత… ఇంకెన్ని దరఖాస్తులు తీసుకుంటారని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయం చేసుకోనిస్తారా లేదా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటూ తిప్పలు పెడుతారా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. కేసీఆర్ రైతాంగాన్ని కడుపులో పెట్టుకొని కాపాడుకున్నారని, కానీ ఈ కాంగ్రెస్ నాయకులు రైతాంగాన్ని కుదేలు చేస్తున్నారని అన్నారు. రైతు భరోసాకు షరతులు, నిబంధనలు పెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారని ఎండగట్టారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేక ఏర్పడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ పార్టీ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుందని తెలిపారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు.