
తెలంగాణలో మరోసారి ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య వివాదం బహిర్గతమైంది. ఈసారి ఏకంగా సీఎం రేవంత్ నిర్వహిస్తున్న శాఖలతో పాటు ఇతర మంత్రుల శాఖల మీద గురి పెట్టారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రేవంత్ రెడ్డిపై ఆర్టీఐ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. భూ కేటాయింపులు, టెండర్ల వివరాలతో పాటు తన సొంత శాఖపై కూడా ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు జూపల్లి.
అన్ని మంత్రిత్వ శాఖల మీద ఆర్టీఐలు వేస్తోంది మంత్రి జూపల్లి కృష్ణారావు బృందం. వివరాలు ఇవ్వకపోతే అధికారులకు ఫోన్ చేసి ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. సొంత శాఖపై సైతం మంత్రి ఆర్టీఐ దాఖలు చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మంత్రిగా ఉన్న తనకే సమాచారం ఇవ్వకపోతే సామాన్య ప్రజలను ఎలా సతాయిస్తున్నారో అర్థం అవుతుంది అంటూ ఆర్టీఐ అధికారులపై మండిపడుతున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు





