క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు విశ్వసనీయ సమాచారం. మృతుల్లో ఇద్దరు అగ్ర స్థాయి నేతలు ఉన్నట్టు అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్ ‘ఆపరేషన్-2 కగార్’లో భాగంగా జరిగినదని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా కర్రెగుట్ట పరిసరాల్లో మావోయిస్టు అగ్ర నేతల సంచారం ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని ముట్టడించాయి. తెల్లవారుజామున ప్రారంభమైన కూంబింగ్ సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో ప్రతిగా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. గంటల పాటు కొనసాగిన ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రాథమిక సమాచారం.
ఈ ఆపరేషన్‌లో సుమారు ఐదు వేల మంది Central Reserve Police Force (సీఆర్పీఎఫ్) సిబ్బంది పాల్గొన్నట్టు తెలుస్తోంది. అగ్ర నేతలే లక్ష్యంగా ‘ఆపరేషన్-2 కగార్’ను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇంకా 40 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండడంతో బలగాలు వేగం పెంచినట్టు సమాచారం.
ఎన్‌కౌంటర్ ప్రాంతంలో భారీగా ఆయుధాలు, సాహిత్యం, కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అగ్ర నేతల మృతి ధృవీకరణపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
కర్రెగుట్ట పరిసరాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. అదనపు బలగాలు మోహరించగా, అటవీ ప్రాంతాల్లో ఇంకా కూంబింగ్ కొనసాగుతోంది. ‘ఆపరేషన్-2 కగార్’ డెడ్‌లైన్ ముగియకముందే కీలక లక్ష్యాలను సాధించాలని భద్రతా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
