
Mass Warning: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరిగింది. బీఆర్ఎస్‌పై ఆరోపణలతో ముందే దూకుడులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఇప్పుడు మరింత కఠిన వ్యాఖ్యలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ముఖ్యంగా కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, బీఆర్ఎస్ నేతలు, కొంతమంది బీజేపీ ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఘర్షణాత్మక వాతావరణానికి దారి తీసాయి. ఇవాళ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కవిత.. ఇప్పటివరకూ వచ్చిన రాజకీయ ఆరోపణలను కేవలం ప్రారంభం మాత్రమేగా అభివర్ణిస్తూ, అసలైన రాజకీయ పోరాటం ఇంకా మొదలు కాలేదని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేస్తూ తనను కూడా లాగేందుకు ప్రయత్నిస్తోందని, కానీ అటువంటి ప్రయత్నాలు ఎవరికీ ఉపయోగం కాలేవని స్పష్టం చేశారు. తనపై అనవసర వ్యాఖ్యలు చేసే వారిని “గుంటనక్కలు” అని పిలుస్తూ, రాజకీయాల్లో దూకుడుతో ముందుకు వచ్చినప్పుడు చేసే ఆరోపణలు మాత్రమే కాదు.. వారు దాచిపెట్టిన అవినీతి, అక్రమాలన్నీ బయటపెడతానని హెచ్చరించారు. ప్రజల్లో తిరుగుతున్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి ఒకటొకటిగా వెలుగులోకి వస్తోందని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.
తన రాజకీయ భవిష్యత్తుపై కూడా కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సమయం వచ్చినప్పుడు తాను కూడా ముఖ్యమంత్రి పదవికి చేరగల పాత్రలో ఉండగలనని, అలాంటి అవకాశం వస్తే 2014 నుండి ఇప్పటి వరకు జరిగిన పోలీస్ కేసులు, భూ మార్పిడి నిర్ణయాలు, అవినీతి కేసులను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయిస్తానని స్పష్టం చేశారు. ఆ నిర్ణయాలు రాజకీయాలకు కాదు, న్యాయానికి సంబంధించినవని అన్నారు.
బీఆర్ఎస్ అవినీతి గురించి మాట్లాడితే బీజేపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారో కూడా ప్రశ్నించారు. తన భర్త ఫోటో చూపిస్తూ మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అసత్య ఆరోపణలు చేస్తే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. “అవినీతి చేస్తున్నామని అరెస్టులు చేస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు ఎందుకు నోరు మూసుకుందో?” అని కవిత ప్రశ్నించారు.
కవిత చేసిన మరో సంచలన ఆరోపణ పందెం కోళ్ల కేసుకు సంబంధించినది. కేటీఆర్ బినామీగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, అలాంటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయన్ని ఇప్పటి వరకూ అరెస్ట్ చేయకపోవడం అనేది పెద్ద ప్రశ్నార్ధకమని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమల కోసం కేటాయించిన భూములను నివాస భూములుగా మార్చడం, ఉద్యమ సమయంలో కొందరిని బెదిరించి డబ్బులు తెప్పించడం వంటి విషయాలు అన్నీ తనకు తెలుసని, కానీ ఇంకా తన వద్ద ఉన్న చిట్టా మొత్తం బయటపెట్టలేదని స్పష్టం చేశారు. “ఆడపిల్ల కాబట్టి లైట్‌గా తీసుకుంటున్నారా? ఒక్కొక్కడి తోలు తీస్తా” అని హెచ్చరింపు ఇచ్చిన కవిత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
తనపై చేసిన ఆరోపణలను తాను భరించబోనని స్పష్టంగా ప్రకటించిన కవిత.. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణరావు, టీ న్యూస్‌పై లీగల్ నోటీసులు పంపించారు. వారంలోపే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ, లేకపోతే న్యాయస్థానంలోనే సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కాయి.





