
చండూరు, క్రైమ్ మిర్రర్:- మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ గణేష్ ఊకే(65) ప్రస్థానం ఆయన స్వగ్రామంలో ముగిసింది. ఈనెల 25న ఒడిశాలో జరిగిన పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందిన హనుమంతు భౌతికకాయం ఆదివారం నల్గొండ జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చేరుకుంది. హనుమంతు విగతజీవిగా ఇంటికి రావడాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా రోదించడం అక్కడున్న వారిని కలచివేసింది.
కన్నీటి సంద్రమైన పుల్లెంల
హనుమంతు మృతదేహం గ్రామానికి చేరుకోగానే ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇన్నాళ్లు ఏదో ఒక రోజు క్షేమంగా తిరిగి వస్తాడని ఆశించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆయన మృతదేహాన్ని చూడగానే కన్నీటిపర్యంతమయ్యారు.చుట్టుపక్కన గ్రామస్థులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి హనుమంతుకు కడసారి వీడ్కోలు పలికారు.
*జోహార్ల నినాదాలతో అంతిమయాత్ర*
పుల్లెంల గ్రామంలో హనుమంతు అంతిమయాత్రను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం నేతలు, విప్లవ రచయితల సంఘం ప్రతినిధులు, మాజీ మావోయిస్టులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. “అమరవీరుడు పాక హనుమంతు అమర్ రహే” అంటూ చేసిన నినాదాలతో గ్రామం దద్దరిల్లింది. ఉద్యమకారునిగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ నాయకులు ఘన నివాళులర్పించారు.
పోలీసుల భారీ మోహరింపు
మావోయిస్టు అగ్రనేత అంత్యక్రియలు కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. చండూరు పోలీసులు మరియు ప్రత్యేక బలగాలతో పుల్లెంల గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామానికి వచ్చే రహదారులపై నిఘా ఉంచారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. చివరగా, కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య హనుమంతు అంత్యక్రియలు ముగిశాయి….





