-
సిమెంట్ మిక్సర్ లారీని ఢీ కొట్టిన డీసీఎం
-
ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి
-
మరో ముగ్గురు తీవ్రంగా గాయాలు
-
మృతులంత బీహార్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తింపు
-
కేసు నమోదు చేసి దర్యాప్తు పోలీసులు
మిర్యాలగూడ, క్రైమ్ మిర్రర్: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సిమెంట్ మిక్సర్ లారీని ఇటాలియన్ మార్బుల్ లోడ్‌తో వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ఢీకొట్టడంతో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి మిర్యాలగూడ వైపు వస్తున్న సిమెంట్ మిక్సర్ లారీని, శంషాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న డీసీఎం వాహనం మిర్యాలగూడ టౌన్ పరిధిలోని ఈదులగూడెం చౌరస్తా వద్ద వేగంగా ఢీకొట్టింది.
ఢీకొన్న తీవ్రతకు డీసీఎం వాహనం ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డీసీఎంలో ప్రయాణిస్తున్న కూలీలు తీవ్రంగా నలిగిపోయారు. బీహార్ రాష్ట్రానికి చెందిన బీరు బాయ్ (30), సంతోష్ (30), సూరజ్ (18) అక్కడికక్కడే మృతి చెందారు. అదే వాహనంలో ఉన్న సుజిత్ కుమార్, కిషన్, సికిందర్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు మరియు పోలీసులు వెంటనే వారిని మిర్యాలగూడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న వెంటనే వన్‌టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన పరిస్థితులపై ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు, అతివేగమే ప్రమాదానికి ప్రధాన కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ప్రమాద ఘటనతో ఈదులగూడెం చౌరస్తా ప్రాంతంలో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకోగా, కార్మికుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతున్న ఘటనగా ఇది మారింది.





