తెలంగాణ

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో స్థానికులకే ప్రాధాన్యం

  • మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యలు

  • అభ్యర్థుల విషయంలో గట్టి పోటీ ఉంది

  • పోటీచేసే అభ్యర్థి ఎంపికపై సర్వే నిర్వహిస్తున్నాం

  • జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయం: పొన్నం

క్రైమ్‌మిర్రర్‌, హైదరాబాద్‌: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కీలక వ్యాఖ్యల చేశారు. అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోందని, కచ్చితంగా స్థానిక వ్యక్తికే టికెట్‌ లభిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల విషయంలో గట్టి పోటీ ఎదురవుతోందన్నారు. కాంగ్రెస్‌లోని కీలక నేతలు ఇక్కడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని వెల్లడించారు. అభ్యర్థుల ఎంపిక సర్వే జరుగుతోందని తెలిపారు. అందరి అభిప్రాయం తీసుకున్నాకే అభ్యర్థి ఎంపిక జరుగుతుందన్నారు. అధిష్ఠానం ఎవరికి టికెట్‌ ఇస్తే వారే పోటీ చేస్తారన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం టికెట్‌ ఇచ్చినవారి గెలుపు కోసం అందరం కృషి చేస్తామన్నారు. ఈసారి జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరడం ఖాయమని పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిదే

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందేనని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఉప ఎన్నిక కోసం అన్ని పార్టీలు సన్నద్ధమయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ మృతితో ఈ స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. అయితే సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్‌ఎస్‌ వ్యూహాలు రచిస్తోంది. గోపినాథ్‌ భార్యను బరిలో దించి, జూబ్లీహిల్స్‌లో గులాబీ జెండా ఎగరేయాలని భావిస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌లోనూ ఇప్పటివరకు అభ్యర్థి ఎంపికపై ఎలాంటి ప్రకటన రాలేదు.

కాంగ్రెస్‌ ఖాతాలో మరో సీటు చేరుతుందా?

గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌ మహా నగరం నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్‌ నుంచి గెలవలేదు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం నుంచి మల్‌రెడ్డి రంగారెడ్డి మాత్రం కాంగ్రెస్‌ నుంచి గెలుపొందారు. అయితే కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీగణేష్‌ గెలుపొందారు. దీంతో జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒక సీటు కాంగ్రెస్‌ ఖాతాలో చేరినట్టయింది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ఫలితాలు కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.

Read Also: 

  1. ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో 18 మంది మృతి!
  2. ముడుపులతో మూలమలుపుల రోడ్డు నిర్మాణం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button