
జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం రేపిన చిన్నారి హితాక్షి హత్య కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు పోలీసులు.చిన్నారిని చంపింది కుటుంబ సభ్యులేనని తేల్చారు. తల్లిపై కోపంతో చిన్నారిని అతి కిరాతకంగా హతమార్చింది పిన్ని. తోటికోడలి పెత్తనం తట్టుకోలేక చిన్నారిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
జగిత్యాల జిల్లా కోరుట్లలో జరిగిన హత్య కేసులో చిన్నారి హితాక్షిని హత్య చేసింది ఆమె పిన్ని మమతగా నిర్ధారించారు పోలీసులు. కోరుట్ల ఆదర్శనగర్ కు చెందిన సోదరులు ఆకుల రాము, లక్ష్మణ్ లకు అక్కాచెల్లెళ్ళ కూతుర్లు నవీన, మమతలతో వివాహం జరగింది. అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. రాము నవీన దంపతులకు వేదాంశ్, హితాక్షి అనే ఇద్దరు పిల్లలు ఉండగా.. లక్ష్మణ్ మమత దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
నాలుగు నెలల క్రితం ఆన్లైన్ బెట్టింగ్ లో రూ.18 లక్షలు కోల్పోయింది మమత. ఇంట్లో నవీనకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆమె పట్ల ద్వేషం పెంచుకుంది మమత. దీంతో ఆమె కూతురు హతాక్షిని చంపాలని నిర్ణయించుంది. గత శనివారం సాయంత్రం స్కూలు నుండి వచ్చిన పిల్లలతో పెద్ద పులుల వేషధారణలు చూసేందుకు, కూరగాయలు కోసే కత్తి, చెట్లు కత్తిరించే కట్టర్ తో వెళ్లింది మమత. సమీపంలోని ఒక ఇంటికి గేటు, బాత్ రూం డోర్ లేకపోవడంతో, హితాక్షిని ఆ ఇంట్లోకి తీసుకెళ్లింది మమత. బాత్ రూంలో పడేసి కత్తితో గొంతు కోసి, కట్టర్ తో మెడ కట్ చేసి చిన్నారిని హత్య చేసింది మమత.
ఇంటికి వచ్చి బట్టలు మార్చుకొని, అందరితో కలిసి హితాక్షిని వెతికే పనిలో పడింది మమత. మృతదేహం దొరికిన తరువాత ఆసుపత్రిలో మమత అందరితో కలిసి బోరున విలిపించినట్టు తెలిపారు పోలీసులు. ఈ హత్య ఆమె ఒక్కతే చేసిందా, దీని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు పోలీసులు.