
తెలంగాణ కాంగ్రెస్ లో వర్గ పోరు ముదురుతోంది. కొంత కాలంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేస్తున్న సీనియర్ నాయకుడు, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయారు. తనకు పదవి రాకుండా ఆపేదెవడు.. మంత్రి పదవి ఎలా రాదో చూస్తానని చెప్పారు. తనకు పదవి రాకుండా అడ్డుకున్నారంటూ పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కొన్ని రోజుల ఆపగలరేమో.. కాని ఎప్పటికి ఆపలేరంటూ ఒక రకంగా సీఎం రేవంత్ రెడ్డికి చాలెంజ్ విసిరారు రాజగోపాల్ రెడ్డి.
తనపై రాజగోపాల్ రెడ్డి చేస్తున్న కామెంట్లపై సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. క్రెడాయ్ ఈవెంట్ లో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కొందరు తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని పరోక్షంగా రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పదవులు అందరికి ఇవ్వడం సాధ్యం కాదన్నారు. 10 మంది ఆశిస్తే ఒకరికే అవకాశం రావచ్చు.. అప్పుడు అందరూ తమకు కావాలంటే ఎలా అని ప్రశ్నించారు. కుటుంబ కారణంగానే.. కులం కారణంగానే కొందరికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. పరోక్షంగా ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.