తెలంగాణలో మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. తెలంగాణలో ఇకపై కింగ్ పిషర్ బీర్లు కనిపించవు. రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడుపోయేవి కింగ్ పిషర్ బీర్లే. సేలయ్యే బీర్లలో 60 శాతం వాటా ఒక్క కింగ్ పిషర్ దే. అయితే తెలంగాణకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు కింగ్ పిషర్ బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ తెలిపింది.యూబీ ప్రకటనతో తెలంగాణకు కింగ్ పిషర్ బీర్ల సరఫరా ఆగిపోయింది.
బీర్ల సరఫరా ఆగిపోవడంపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. మద్యం ధరల పెంపుపై విశ్రాంత హైకోర్టు జడ్జితో కమిటీ ఏర్పాటు చేసి నివేదిక కోరామని, నివేదిక వచ్చిన తర్వాతే ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వివిధ బ్రాండ్ల బీర్ల ధరలు పెంచాలని కోరుతున్నారని.. బీర్ల ధరలు 33.1 శాతం పెంచాలని యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ కోరుతోందని మంత్రి చెప్పారు. ధరలు పెంచితే మద్యం ప్రియులపై భారం పడుతుందన్నారు.ముడి సరకుల ధరలు పెరిగితే మద్యం ధరలు పెరుగుతాయన్నారు.
యూబీఎల్ కంపెనీ మార్కెట్ షేరు 69 శాతంగా ఉంది. గత ప్రభుత్వం మొత్తంగా దాదాపు రూ. 8 లక్షల కోట్ల వరకు అప్పులు, బకాయిలు పెట్టింది. వాటికి నెలకు రూ. 6 వేల కోట్ల వరకు వడ్డీ చెల్లిస్తున్నాం. మరో రూ. 40 వేల కోట్ల వరకు బిల్లులు పెండింగ్ పెట్టారు. ఇందులో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కు సంబంధించి రూ. 2,500 కోట్ల వర కు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రూ. 1,139 కోట్ల బకాయిలు చెల్లించాం. ఇవాల్టి వరకు మొత్తం రూ. 658 కోట్లు పెండింగ్ ఉంది. యూబీ బీర్లకు సంబంధించి ఇంకా 14 లక్షల కేసుల స్టాక్ ఉంది. ఇతర రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన తెలంగాణ రాష్ట్రం లోనే మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. కర్ణాటకలో బీరు రూ. 190, ఏపీలో రూ. 180, తెలంగాణలో రూ. 150, తమిళనాడులో రూ. 150గా ఉంది. యూబీ కంపెనీ ఒత్తిడికి లొంగం.. భవిష్యత్తు లోనూ మిగతా రాష్ట్రాల కన్నా తెలంగాణ లోనే తక్కువ ధరలు ఉండేలా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు..