Karnataka Crime News: ఇన్‌స్టాగ్రామ్‌లో యువతితో చాటింగ్ ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. వద్దన్నా వినకుండా మెసేజ్‌లు చేయటంతో దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. చిక్కమంగళూరు జిల్లా తారికెరె తాలూకా ఉదెవా గ్రామానికి చెందిన మంజునాథ్ అనే 21 ఏళ్ల యువకుడు తనకు ఇన్‌స్టాలో పరిచయం ఉన్న అమ్మాయికి తరచుగా మెసేజ్‌లు చేస్తూ ఉండేవాడు.
నిశ్చితార్థం అయినప్పటికీ..
రీసెంట్ గా అమ్మాయికి నిశ్చితార్థం అయ్యింది. వెంటనే, ఆ అమ్మాయి నాకు నిశ్చితార్థం అయింది. ఇకపై మెసేజ్‌లు చేయొద్దని గట్టిగానే చెప్పింది. కానీ, మంజునాథ్ ఆ యువతి మాటల్ని పట్టించుకోలేదు. పదే పదే మెసేజ్‌లు చేస్తూ ఉన్నాడు. దీంతో విసుగు చెందిన యువతి తనకు కాబోయే భర్త వేణుకు విషయం చెప్పింది. మంజునాథ్ మెసేజ్‌లు చేసి విసిగిస్తున్నాడని అంది. ఆమె చెప్పింది విని వేణు ఆగ్రహానికి గురయ్యాడు.
యువకుడిని హత్య చేసిన కాబోయే భర్త
ఎలాగైనా మంజునాథ్‌కు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఇందుకోసం ఓ పక్కా ప్లాన్ వేశాడు. తన స్నేహితులు కిరణ్, అప్పు, మంజును తన ప్లాన్‌లో భాగం చేసుకున్నాడు. ప్లాన్ ప్రకారం వేణు.. మంజునాథ్‌కు ఫోన్ చేసి మాట్లాడటానికి పిలిచాడు. మంజునాథ్ వారు చెప్పిన చోటుకు వెళ్లాడు. అక్కడ వేణు, కిరణ్, అప్పు, మంజులు కలిసి మంజునాథ్‌ను చావగొట్టారు. విచక్షణా రహితంగా కత్తితో పొడిచి అక్కడినుంచి పారిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మంజునాథ్‌ను స్థానికులు శివమొగ్గలోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే పరిస్థితి చెయ్యి దాటి పోయింది. చికిత్స పొందుతూ మంజునాథ్ చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. మంజునాథ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.





