
కన్నా లక్ష్మీనారాయణ… సీనియర్ రాజకీయ నాయకుడు. ప్రస్తుతం సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే. ఎన్నికల ముందు తెగ హడావుడి చేశారు కన్నా. అప్పటి సత్తెనపల్లి ఎమ్మెల్యే, మంత్రి అంబటి రాంబాబుపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు అంబటి వర్సెస్ కన్నా అన్నట్టు రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు ఏమైంది…? ఎన్నికలు అయ్యి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. కన్నా కనుమరుగయ్యారు. అసలు ఆయన ఊసే లేదు. టీడీపీలోనే ఉన్నా… ఎందుకు అంత స్తబ్ధుగా ఉంటున్నారు..? అని అందరూ చర్చించుకుంటున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ రాజకీయ ప్రస్తానం చూసుకుంటే… ఆయన అన్ని ప్రధాన పార్టీల్లో చేశారు. ముందు కాంగ్రెస్‌లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో బీజేపీని ఆడిపోసుకున్నారు. ఆ తర్వాత వైఎస్‌ఆర్ మరణించడం, తెలంగాణ-ఏపీ విడిపోవడంతో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. ఆ సమయంలో బీజేపీ పంచన చేరారు కన్నా లక్ష్మీనారాయణ. అప్పుడు… అటు కాంగ్రెస్, ఇటు టీడీపీపై విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. అధికారంలోకి వస్తుందని అందరూ అనుకున్నారు. ఆ సమయంలో వైఎస్‌ఆర్‌సీపీలో చేరేందుకు ప్రయత్నించారు కన్నా. కానీ.. చివరి నిమిషంలో బీజేపీ అధిష్టానం బుజ్జగించి.. ఏపీ బీజేపీ చీఫ్ పదవి ఇవ్వడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా… వెలుగులో ఉన్నారు. చంద్రబాబు, జగన్‌పై ఫైరయ్యారు. ఆ పదవీకాలం అయిపోయాక.. మళ్లీ నోరు కట్టేసుకున్నారు. 2024 ఎన్నికల ముందు.. బీజేపీని వీడి టీడీపీలో చేరారు. సత్తెనపల్లె నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి… వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థి అంబటి రాంబాబును ఓడించారు. సిట్టింగ్ మంత్రి ఓడించిన ఆయన్ను కేబినెట్‌లోకి తీసుకుంటారని కన్నా ఆశించారు. కానీ.. అలాజరగలేదు. దీంతో… అలక బూనినట్టు తెలుస్తోంది.
ఇవన్నీ కాక… కన్నా లక్ష్మీనారాయణపై, ఆయన కుమారుడిపై భారీగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలు.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెవిలో కూడా పడ్డాయి. దీంతో… చంద్రబాబు… కన్నా తీరుపై కాస్త కోపంగా ఉన్నారట. ఈ పరిస్థితిలో నోరు మెదిపితే.. అసలుకే మోసం వస్తుందని భావిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ… మాట్లాడకపోవడమే ఉత్తమం అని అనుకున్నట్టు ఉన్నారు. అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నారని సమాచారం.