తెలంగాణ

సంక్రాంతికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. అర్హులు వీళ్లే!

దేశంలో ఏరాష్ట్రంలో జ‌ర‌గ‌ని విధంగా తెలంగాణ‌లో వ‌చ్చే నాలుగు సంవ‌త్స‌రాల‌లో 20 ల‌క్ష‌ల ఇండ్ల‌ను నిర్మిస్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. రాష్ట్రంలో గృహ‌నిర్మాణాల‌కు సంబంధించి ఆయ‌న హియాయ‌త్‌న‌గ‌ర్‌లోని హౌసింగ్ కార్పోరేష‌న్ కార్యాల‌యంలో అధికారుల‌తో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణాల‌ను ప‌ర్య‌వేక్షించేందుకుగాను రాష్ట్రంలోని 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్ధాయి క‌లిగిన ప్రాజెక్ట్ డైరెక్ట‌ర్ల‌ను నియ‌మించామని మంత్రి తెలిపారు. ఏటా నాలుగున్న‌ర ల‌క్ష‌ల చొప్పున వ‌చ్చే నాలుగేళ్ల‌లో 20 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా అత్యంత నిరుపేద‌ల‌కు ఇండ్లు నిర్మిస్తామన్నారు.ఈనెల 23తేదీ నాటికి సుమారు 32 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తులను ప‌రిశీలించ‌డం జ‌రిగిందన్నారు. రోజుకు నాలుగున్న‌ర నుంచి ఐదున్న‌ర ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిశీలిస్తున్నామ‌ని.. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో ఇందిర‌మ్మ ఇండ్ల‌కోసం వ‌చ్చిన 80 ల‌క్ష‌ల ద‌ర‌ఖాస్తుల ప‌రిశీల‌న పూర్త‌వుతుంద‌ని..ఆ త‌ర్వాత ల‌బ్దిదారుల ఎంపిక పూర్తిచేసి సంక్రాంతి నాటికి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించే విధంగా చ‌ర్య‌లు తీసుకుంటున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు.

హౌసింగ్ కార్పొరేష‌న్ బ‌లోపేతం చేస్తున్నామ‌ని గ‌త ప్ర‌భుత్వం ఈ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు మంత్రి. వివిధ విభాగాల‌లో ప‌నిచేస్తున్న 95శాతం కార్పొరేష‌న్ ఉద్యోగుల‌ను వెన‌క్కి తీసుకురావ‌డం జ‌రిగిందన్నారు. ఈ ఏడాది నాలుగ‌న్న‌ర ల‌క్ష‌ల ఇండ్ల నిర్మాణ‌మే కాకుండా 20 ల‌క్ష‌ల ఇండ్లు నిర్మించ‌డానికి అవ‌స‌ర‌మైన యంత్రాంగాన్ని స‌మ‌కూర్చుకుంటున్నామని వెల్లడించారు. ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం నిరంత‌ర ప్ర‌క్రియ‌. చిన్న‌చిన్న త‌ప్పులు కూడా జ‌ర‌గ‌కుండా అవినీతికి ఆస్కారం లేకుండా పార‌ద‌ర్శ‌కంగా ల‌బ్దిదారుల ఎంపిక జ‌రుగుతుంద్ననారు. మొదటి విడ‌త‌లో విక‌లాంగులు, వితంతువులు వంటి వారికి అవ‌కాశం ఇస్తామని తెలిపారు.

కేంద్ర ప్ర‌భుత్వం త‌న నిబంధ‌న‌ల మేర‌కు కొంత‌మందిని తిర‌స్క‌రించినా రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున వారికి ఇండ్లు ఇస్తాం. కేంద్రం విధించే నిబంధ‌న‌ల‌ను ఆమోదిస్తూ కేంద్ర నిధుల‌ను తీసుకుంటాం. ఈ విష‌యంలో మేం ఎటువంటి బేష‌జాల‌కు పోయేదిలేదు. రాష్ట్ర ఆర్ధిక ప‌రిస్ధ‌తి బాగులేకున్నా ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణం విష‌యంలో త‌గ్గేదిలేదు. త‌ల‌తాక‌ట్టుపెట్ట‌యినా ఇండ్లు నిర్మిస్తాం. దీనికి సంబంధించి సిఎం రేవంత్ రెడ్డి పేషి మొద‌లు కొని నా పేషీ, ముఖ్యఅధికారుల కార్యాల‌యాల‌లో ప్ర‌త్యేక విభాగాలు ఏర్పాటుచేస్తాం

ఇందిర‌మ్మ ఇండ్ల నిర్మాణానికి గాను ప్ర‌త్యేక విధివిధానాలు ప్ర‌క‌టిస్తాం. వారంరోజులు లోగా ప్ర‌త్యేక ఫిర్యాదుల విభాగాన్ని ఏర్పాటు చేస్తాం. ప్ర‌త్యేక వెబ్‌సైట్, టోల్ ఫ్రీ నెంబ‌ర్లు ఇస్తాం. రాష్ట్రంలోని ఏ మారుమూల తండా, లేదా గ్రామం నుంచైనా ఫిర్యాదు చేస్తే త‌క్ష‌ణం స్పందించి చ‌ర్య‌లు తీసుకుంటాం. ఫిర్యాదు దారునికి తిరిగి వివ‌రాలు అందిస్తాం. ఇప్ప‌టికే గ్రామాల వారీగా రెవెన్యూ అధికారుల నియామ‌కానికి నిర్ణ‌యించాం. త్వ‌ర‌లో 1200 వ‌ర‌కు స‌ర్వేయ‌ర్ల‌ను నియ‌మిస్తాం.

రేష‌న్‌కార్డులతో సంబంధం లేకుండా సొంత స్ధ‌లం ఉన్న‌వారికి తొలుత ప్రాధాన్య‌త ఇస్తాం. గ్రామాల వారీగా ఇందిర‌మ్మ కమిటీలు ల‌బ్దిదారుల‌ను ఎంపిక‌చేస్తాయి. ఈ నేప‌ధ్యంలో ఏ అధికారి త‌ప్పుచేసినా గ‌ట్టిచ‌ర్య‌లు తీసుకుంటాం. గ‌త ప్రభుత్వం అసంపూర్తిగా వ‌దిలేసిన ఇండ్ల‌ను కూడా నిర్మిస్తాం. హైద‌రాబాద్ న‌లువైపులా వందేసి ఎక‌రాల‌ను సమీక‌రించి హౌసింగ్ బోర్డు ఆధ్వ‌ర్యాన ఇండ్ల నిర్మాణం చేప‌డ‌తాం. అని మంత్రి పొంగులేటి తెలిపారు
స‌మావేశంలో గృహ‌నిర్మాణ శాఖ ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి బుద్ధ ప్ర‌కాష్, ఎండీ గౌత‌మ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button