India-EU Trade Deal Finalised: ట్రంప్ టారిఫ్ లతో ప్రపంచ దేశాలు ఆందోళనకు గురవుతున్న వేళ, భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. వాణిజ్యం కోసం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం, ఇతర మార్కెట్లను అందిపుచ్చుకోవడం దిశగా భారత్ ముందడుగు వేసింది. యూరప్ దేశాలకు ఎగుమతి చేసే చాలా రకాల ఉత్పత్తులపై సుంకాలు పూర్తిగా తొలగిపోనున్నాయి. దీనితో భారత వ్యాపారులు, ఎగుమతిదారులకు ప్రయోజనం కలగనుంది. యూరప్ దేశాల నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే కార్లు, వైన్స్, అత్యవసర ఔషధాలు వంటి వాటి ధరలు తగ్గనున్నాయి.
హైదరాబాద్ హౌస్ లో భారత్-ఈయూ కీలక సమావేశం
తాజాగా ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో 16వ భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశం జరిగింది. దానికి ముందు ప్రధాని మోడీ ఈ ఒప్పందంపై ప్రకటన చేశారు. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య భారీ ఒప్పందంపై సంతకాలు జరిగాయన్నారు. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణించారు. భారత్‌లోని 140 కోట్ల మంది, ఈయూలోని కోట్లాది మంది ప్రజలకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయన్నారు. భారత్, ఈయూ ఉమ్మడి జీడీపీ ప్రపంచ జీడీపీలో 25 శాతం ఉందన్నారు. ఇది ప్రపంచ వాణిజ్యంలో మూడో వంతుతో సమానమని మోడీ తెలిపారు.
యూరోపియన్ యూనియన్‌లో భాగమైన 27 దేశాల్లో ఈ ఒప్పందంపై చట్టాలు చేసిన తర్వాత పూర్తిస్థాయిలో అమల్లోకి రానుంది. ఇందుకోసం ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, భారత్-ఈయూ సదస్సులో భాగంగా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌డెర్ లెయెన్, యూ రోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టాలతో ప్రధాని మోడీ భేటీ అయి.. వాణిజ్యంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతోపాటు మొత్తం 13 అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వచ్చే ఐదేళ్లకు సంబంధించిన ఉమ్మడి వ్యూహాత్మక ఎజెండాను ఆమోదించారు.
మరిన్ని ఉద్యోగాలు, విద్య అవకాశాలు
2030 నాటికి భారత్, ఈయూ మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, డిజటల్ కనెక్టివిటీ బలోపేతం చేసేందుకు.. ఉమ్మడి సమగ్ర, వ్యూహాత్మక ఎజెండాను అనుసరించాలని నిర్ణయించారు. ఇది యూరప్ దేశాల్లో భారత యువత ఉద్యోగాలు, విద్య, పరిశోధన రంగాల్లో మంచి అవకాశాలు పొందేందుకు తోడ్పడనుంది. ఇక విపత్తుల నిర్వహణ, భారత రిజర్వు బ్యాంకు- యూరోపియన్ సె క్యూరిటీస్, మార్కెట్స్ అథారిటీ సహకారం, శాస్త్ర సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం పొడిగింపు, గ్రీన్ హైడ్రోజన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు, రహస్య సమాచారం పరస్పర మార్పిడి ఒప్పందంపై చర్చలు చేపట్టడంపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక భారత్- మిడిల్ ఈస్ట్- యూరప్ ఎకనామిక్ కారిడార్ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లాలని, త్వరలోనే మంత్రుల స్థాయి భేటీ నిర్వహించాలని నిర్ణయించారు.





