
Pakistani Fighter Jets Down: ఆపరేషన్ సిందూర్ పై భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కీలక పాత్ర పోషించిందన్నారు. ఈ యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన 6 యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు తెలిపారు. భూఉపరితలం నుంచి గగనతల లక్ష్యాలపై జరిపిన దాడుల్లో ఇదే పెద్దదన్నారు. బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో అమర్ ప్రీత్ సింగ్ పాల్గొని ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ వైమానిక సామర్థ్యాన్ని దెబ్బతీశామన్నారు. పలు ఎఫ్16S యుద్ధ విమానాలను కూల్చడంతో పాటు ఒక హ్యాంగర్ ను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పలు వీడియోలను ప్రదర్శించారు. పాక్ లోని సుక్కూర్ వైమానిక స్థావరం లో దాడి తర్వాత నెలకొన్న పరిస్థితిని వివరించారు. సర్గోధా స్థావరంలోని ఎఫ్-16S యుద్ధ విమానాలపై జరిపిన దాడిని వివరించారు. ఎస్-400 రక్షణ వ్యవస్థ మన వైమానిక రక్షణ వ్యవస్థలోకి పాక్ చొరబడే అవకాశం లేకుండా చేసిందన్నారు. అటు ఆపరేషన్ సిందూర్ విషయంలో కేంద్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్లు తెలిపారు. అందుకే ఆపరేషన్ విజయవంతమైందన్నారు.
భారత్ చెప్పిందంతా అబద్దమే!
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్ కు చెందిన ఆరు విమానాలను కూల్చివేశామన్న భారత ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలపై పాకిస్తాన్ రియాక్ట్ అయ్యింది. ఈ వ్యాఖ్యలన్నీ అబద్దమేనని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తేల్చి చెప్పారు. అదో అసంబద్ధమైన వాదన అంటూ కొట్టిపారేశారు. ఈ యుద్ధంతో పాకిస్తాన్ ఒక్క విమానాన్నీ కోల్పోలేదన్నారు. స్వతంత్ర ధృవీకరణ కోసం ఇరు దేశాల విమానాల లిస్టును బయటపెడతామన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
Read Also: భారత పర్యటనకు పుతిన్, ఎప్పుడు వస్తారంటే?