Visakhapatnam T20I: విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో టీమిండియా విమన్ టీమ్ అలవోక విజయం సాధించింది. ఆడుతూ పాడుతూ మ్యాచ్ దక్కించుకుంది. జెమీమా దూకుడు ముందుకు శ్రీలంక బౌలర్లు తేలిపోయారు.
టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న భారత్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. శ్రీలంక బ్యాటర్లను 121 పరుగులకే కట్టడి చేసింది. 122 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో శ్రీలంకపై భారత మహిళల జట్టు తొలి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్(69*) హాఫ్ సెంచరీతో అదరగొట్టింది. మరో ఎండ్ లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (15*) నాటౌట్‌గా నిలిచింది. షెఫాలీ వర్మ(9), స్మృతి మంధాన(25) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. శ్రీలంక బౌలర్లలో కవింది, రణవీర చెరో వికెట్ తీశారు.
బ్యాటింగ్ లో తడబడిన శ్రీలంక
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తడబడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. ఓపెనర్ గుణరత్నే(39) టాప్ స్కోరర్. కెప్టెన్ చమరి ఆటపట్టు (15), హాసిని పెరీరా (20), హర్షిత (21) పర్వాలేదనిపించారు. భారత్ బౌలర్లలో క్రాంతి గౌడ్, దీప్తి శర్మ, శ్రీచరణి తలో వికెట్ తీశారు.





