President Murmu Republic Day Address: 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతినుద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఘర్షణలు నెలకొన్న ప్రస్తుత ప్రపంచానికి భారత్ శాంతిదూతగా మారిందన్నారు. మానవజాతి భవిష్యత్తు భద్రంగా ఉండేలా చూసేందుకు శాంతి సందేశాన్ని వినిపిస్తోందని చెప్పారు. ప్రపంచ పరిస్థితులను వివరిస్తూ విశ్వశాంతి కోసం ప్రార్థనలు చేయడం భారతీయ నాగరికతలో భాగమని, దాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. అదే సమయంలో జాతి భద్రతకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడానికి చేపట్టిన ఆపరేషన్ సిందూరే ఇందుకు నిదర్శనమని అన్నారు.
దేశం ఎదిగేందుకు మహిళల పాత్ర కీలకం
రాష్ట్రపతి ముర్ము తన ప్రసంగంలో ‘నారీ శక్తి’ని ప్రధానంగా ప్రస్తావించారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి మహిళల పాత్రే కీలకమని చెప్పారు. గ్రామీణ స్వయం సహాయక బృందాలు, అంతరిక్షం, రక్షణ…ఇలా అన్నిరంగాల్లో ఆధునిక భారత చరిత్రను కుమార్తెలే రాస్తున్నారని పొగిడారు. మహిళల ఆధారిత అభివృద్ధి జాతి ప్రాధాన్యతగా మారిందని నొక్కిచెప్పారు. మహిళా క్రికెట్ చరిత్రలో గత ఏడాది బంగారు అధ్యాయమని ప్రశంసించారు. వరల్డ్ కప్ గెలిచి గర్వకారణంగా నిలిచారని అన్నారు. డిజిటల్ ఆర్థిక రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, ప్రపంచానికే భారత్ నాయకత్వం వహిస్తోందని ముర్ము చెప్పారు.





