Sunday, February 15, 2026
Homeఅంతర్జాతీయంImran Khan: జైలులో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన.. వైరల్ అవుతోన్న ఫోటో

Imran Khan: జైలులో ఇమ్రాన్ ఆరోగ్యంపై ఆందోళన.. వైరల్ అవుతోన్న ఫోటో

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనకర సమాచారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం రావల్పిండిలోని అదియాలా జైలులో నిర్బంధంలో ఉన్న ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. జైలు గదిలో తీసిన ఒక తాజా చిత్రం సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించడంతో ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2022లో ఆయన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిన అనంతరం పలు కేసుల్లో అరెస్టయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపు 922 రోజులుగా ఒంటరిగా గదిలోనే నిర్బంధ జీవితం గడుపుతున్నారు. బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితుల్లో ఆయన ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత లేకపోవడం కుటుంబ సభ్యులను మరింత కలవరపెడుతోంది.

ఇటీవల ఫిబ్రవరి 12న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను ఆయన న్యాయవాది జైలులో కలుసుకున్నారు. ఆ భేటీ సమయంలో తీసిన చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ బలహీనంగా, తీవ్ర అనారోగ్యంతో, ఒక కన్ను వాచినట్లుగా కనిపించడం గమనార్హం. న్యాయవాది కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం కుడి కంటిలో రెటీనా వద్ద రక్తం గడ్డకట్టడంతో దాదాపు 85 శాతం చూపు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం కేవలం 15 శాతం చూపే మిగిలి ఉందని వెల్లడించారు.

గత 3 నుండి 4 నెలలుగా కంటి సమస్య వేధిస్తున్నప్పటికీ సరైన వైద్య చికిత్స అందలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక నిపుణుడిని నియమించకుండా సాధారణ కంటి చుక్కలు మాత్రమే అందించారని, ఆలస్యంగా చికిత్స ప్రారంభించడం వల్ల చూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలో స్పష్టం చేశారు. “నా కుడి కన్ను చూపు పూర్తిగా కోల్పోతున్నాను, దయచేసి మంచి వైద్యుడికి పంపించండి” అంటూ ఇమ్రాన్ ఖాన్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు విన్నవించుకున్నారని సమాచారం.

ఈ పరిణామాలపై కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. కావాలనే సరైన వైద్యం అందించడం లేదని, ఇది వైద్య నిర్లక్ష్యానికి ఉదాహరణ అని ఆరోపించారు. అలాగే దీనికి పాకిస్తాన్ సైన్యాధిపతి అసిఫ్ మునీర్ బాధ్యత వహించాలని మండిపడ్డారు. మరోవైపు ఇమ్రాన్ స్థాపించిన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ నేతలు, కార్యకర్తలు ఈ వ్యవహారాన్ని రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తూ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని వైద్య నిపుణులతో కూడిన ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కల్పించాలని సూచించింది. ఇటీవల ఆయన జైలులోనే మరణించారన్న వదంతులు వ్యాపించి దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. అనంతరం ప్రభుత్వం స్వయంగా స్పందించి ఆయన సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేయడంతో పాటు కుటుంబ సభ్యులను జైలులో కలిసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తోంది.

ALSO READ: 120 సంవత్సరాల తర్వాత అరుదైన గ్రహ సంయోగం.. ఒకే రాశిలో మూడు ప్రధాన గ్రహాలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments