ICC T20 World Cup 2026: 2026లో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ క్రికెట్ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఉత్కంఠకు గురి చేసింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ కోసం నిర్వహణ సంస్థ అయిన అంతర్జాతీయ క్రికెట్ మండలి ఈసారి రికార్డు స్థాయిలో ఫ్రైజ్‌మనీని ప్రకటించడం ప్రత్యేకతగా నిలిచింది. గత టోర్నీలతో పోలిస్తే ఈసారి మొత్తం ఫ్రైజ్‌మనీని గణనీయంగా పెంచినట్లు వెల్లడించింది. టోర్నీలో వివిధ దశలకు చేరుకున్న జట్లకు వారి ప్రదర్శన ఆధారంగా ఈ భారీ బహుమతులను అందించనున్నట్లు ప్రకటించింది.
ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో భారత జట్టు విజేతగా నిలిచి మరోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. న్యూజిలాండ్ జట్టుతో జరిగిన ఫైనల్ పోరులో భారత ఆటగాళ్లు అద్భుత ఆటతీరును ప్రదర్శించి విజయం సాధించారు. ఈ విజయంతో భారత జట్టుకు కేవలం ట్రోఫీ మాత్రమే కాకుండా భారీ స్థాయిలో నగదు బహుమతులు కూడా లభించనున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రకటించిన వివరాల ప్రకారం విజేత జట్టుకు సుమారు 2.45 మిలియన్ డాలర్ల బహుమతి అందనుంది. భారత కరెన్సీ ప్రకారం ఈ మొత్తం దాదాపు రూ.20 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో విజేత జట్టుకు అందుతున్న అత్యధిక బహుమతుల్లో ఇది ఒకటిగా నిలిచింది.
ఫైనల్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన న్యూజిలాండ్ జట్టు కూడా రన్నరప్‌గా నిలిచి గణనీయమైన బహుమతి పొందనుంది. వారికి సుమారు 1.28 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ ప్రకటించారు. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. అదేవిధంగా సెమీఫైనల్ దశకు చేరుకున్న జట్లు, అలాగే సూపర్ 8 దశలోకి ప్రవేశించిన జట్లకు కూడా పెద్ద మొత్తంలో బహుమతులు ప్రకటించారు. మొత్తం టోర్నీకి సంబంధించి సుమారు 11.28 మిలియన్ డాలర్ల ఫ్రైజ్‌మనీని జట్ల మధ్య పంచనున్నట్లు ప్రకటించారు.
ఇక అంతర్జాతీయ క్రికెట్ మండలి బహుమతులతో పాటు భారత జట్టుకు దేశీయంగా కూడా భారీ ప్రోత్సాహకాలు వచ్చే అవకాశముంది. ప్రపంచంలో అత్యంత సంపన్న క్రికెట్ సంస్థగా గుర్తింపు పొందిన భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టుకు ప్రత్యేక బోనస్ ప్రకటించే అవకాశముందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి. గతంలో భారత జట్టు ప్రపంచకప్ గెలిచినప్పుడు సుమారు రూ.125 కోట్ల వరకు బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే తరహాలో ఈసారి కూడా జట్టు సభ్యులు, కోచింగ్ సిబ్బంది మరియు ఎంపిక కమిటీ సభ్యులకు కలిసి రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు ప్రత్యేక బహుమతి ప్రకటించే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
ఇంకా ఆటగాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేకంగా సన్మానాలు నిర్వహించే అవకాశం ఉంది. పలువురు ఆటగాళ్లకు నగదు బహుమతులు, అవార్డులు, సన్మాన కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విజయం తర్వాత ఆటగాళ్ల ప్రాచుర్యం మరియు బ్రాండ్ విలువ కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. వివిధ కంపెనీలు ప్రకటనల కోసం వారిని సంప్రదించే అవకాశమూ ఎక్కువగా ఉంటుంది.
అహ్మదాబాద్ నగరంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకున్నట్లు అయింది. ఇంతకుముందు 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌ను భారత జట్టు మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో గెలుచుకుంది. తరువాత 2024లో రోహిత్ శర్మ సారథ్యంలో రెండోసారి ఈ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు 2026లో సూర్యకుమార్ నాయకత్వంలో మూడోసారి ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడం భారత క్రికెట్ చరిత్రలో మరో ముఖ్య ఘట్టంగా నిలిచింది.
ALSO READ: గుండె బలానికి ఈ ఆహారాలు మీ మెనూలో ఉంచుకోండి
