
క్రైమ్ మిర్రర్ రాజస్థాన్: రాజస్థాన్‌లో ఐఏఎస్ అధికారుల దంపతుల మధ్య చోటుచేసుకున్న గృహహింస ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి భారతి దీక్షిత్ తన భర్త, సామాజిక న్యాయం, సాధికారత విభాగం డైరెక్టర్ ఆశిష్ మోదీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
తనపై శారీరక, మానసిక వేధింపులకు పాల్పడటమే కాకుండా తుపాకీతో బెదిరించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా జైపూర్ పోలీసులు ఆశిష్ మోదీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతి ప్రస్తుతం ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు.
తమిద్దరూ 2014 బ్యాచ్ రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారులు కాగా, అదే ఏడాది వివాహం జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం తర్వాత మొదట్లో అన్ని బాగానే ఉన్నప్పటికీ, తరువాత ఆశిష్ మోదీ మద్యం అలవాటు కారణంగా తరచూ తనను దౌర్జన్యానికి గురిచేస్తున్నాడని వివరించారు. తమకు పాప పుట్టిన తర్వాత పరిస్థితి మరింత దారుణంగా మారిందని, అత్తింటివారి ప్రవర్తన కూడా తనపై విపరీత ఒత్తిడిగా మారిందని ఆమె వెల్లడించారు.
Also Read:బక్తుల ఆగ్రహం… వేములవాడ రాజన్న దర్శనం మూసివేత
అంతేకాక, ఆశిష్ మోదీకి కొంతమంది నేరస్థులతో సంబంధాలున్నాయని, గత నెలలో తనను ఒక స్నేహితుడి సహాయంతో ప్రభుత్వ వాహనంలో తీసుకెళ్లి కొన్ని గంటలపాటు నిర్బంధించారని భారతి పేర్కొన్నారు. విడాకులు ఇవ్వకపోతే తనను, తన కుటుంబాన్ని చంపేస్తానని తుపాకీతో బెదిరించాడని ఆమె ఆరోపించారు. ఈ ఘటనపై జైపూర్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, ఆశిష్ మోదీ స్పందించమని అడిగినప్పటికీ ఆయన నిరాకరించారు. ఈ సంఘటన రాజస్థాన్ అధికార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఐఏఎస్ అధికారుల కుటుంబంలో ఇలాంటి ఘటన వెలుగుచూడడంపై ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read:నిన్న విజయ్ దేవరకొండ.. నేడు ప్రకాష్ రాజ్.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ?





