
-
సీజ్ వాహనాల అమ్మకం, సెటిల్మెంట్ల పేరుతో డబ్బుల వసూళ్లు… జిల్లా ఎస్పీ సీరియస్
నల్లగొండ, క్రైమ్ మిర్రర్ ప్రతినిధి : నల్లగొండ జిల్లా తిప్పర్తి పోలీస్ స్టేషన్‌లో సీజ్ చేసిన వాహనాలను అక్రమంగా అమ్మే దందా సాగిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు అడ్డంగా బుకయ్యారు. ఈ ఇద్దరిలో 500 రూపాయల వాటాల విషయంలో తలెత్తిన పంచాయితీతో మొత్తం వ్యవహారం బయటపడింది. ఇప్పటికే ఇద్దరు కానిస్టేబుళ్లపై విచారణ కొనసాగుతోంది. సీజ్ వాహనాల అమ్మకంతో పాటు, స్టేషన్ పరిధిలోని పలు కేసుల్ని సెటిల్మెంట్ చేస్తానంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వెలుగుచూశాయి.
వీరిలో ముఖ్యంగా కానిస్టేబుల్ ఎండి వషీమ్, గతంలో స్టేషన్‌లో పనిచేసిన అధికారుల బలహీనతలను చూపిస్తూ బ్లాక్ మెయిల్‌కు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఉన్నాయి. మరో కానిస్టేబుల్ ఉపేందర్ కూడా ఈ గ్రూప్‌లో భాగమైనట్టు సమాచారం. ఈ పరిణామాలపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తీవ్రంగా స్పందించారు. ప్రత్యేక విచారణ బృందం ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేపట్టారు. ఇద్దరినీ సస్పెండ్ చేసే దిశగా చర్యలు ఉండే అవకాశముంది.
విధుల పట్ల నిర్లక్ష్యం, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు, అంటూ జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీ ద్వారా పోలీస్ వ్యవస్థలో బాధ్యతను గుర్తు చేస్తూ హెచ్చరికలు జారీ చేశారు.