
Kaleshwaram Commission : తెలంగాణ రాజకీయాల్లో పెనుపల్లకిల్లు సృష్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కోర్టును ఆశ్రయించి ఘోష్ కమిషన్ నివేదికపై స్టే ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌కు హైకోర్టు మొట్టికాయలు వేసింది. స్టే ఇచ్చే అవసరం లేదని స్పష్టం చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. అంతేగాక, ఈ వ్యవహారంలో పూర్తి కౌంటర్ దాఖలు చేయాలని అటార్నీ జనరల్‌ను (ఏజీ) ఆదేశించింది. ఇక ప్రభుత్వ అభిప్రాయమూ ఆసక్తికరమే. కేసీఆర్, హరీష్ ఇద్దరూ ప్రస్తుతం ఎమ్మెల్యేలు కావడంతో, అసెంబ్లీలో కమిషన్ నివేదికపై చర్చ అనంతరమే తదుపరి చర్యలు తీసుకుంటామని కోర్టును ప్రభుత్వ తరఫున ఏజీ తెలియజేశారు. అంటే కమిషన్ రిపోర్ట్ నేరుగా కార్యాచరణకు దారి తీయదని, ప్రతిపక్ష నేతలుగా ఉన్న వారికీ చర్చలో తగిన అవకాశం ఇస్తామని వెల్లడించారు.
రాజకీయ వ్యూహాలకు కోర్టు షాక్
ఒకవేళ విచారణ ఎదుర్కొంటామని గళమెత్తినవారు, ఇప్పుడు అదే కమిషన్ నివేదికను రద్దు చేయమని కోర్టును ఆశ్రయించడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా ఉందని, ఇదే వారి అసహనానికి నిదర్శనమని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీలో చర్చిద్దాం, జనం ముందే నిజనిజాల్ని బయటపెడదాం అన్న ధైర్యం ముందు… ఇప్పుడు ‘కోర్టులో నిలిపివేయండి’ అని కోరడం రాజకీయ వ్యామోహమే కాదు, నిజాలను దాచే ప్రయత్నంగా కనిపిస్తోంది” అని అధికార పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
ప్రభుత్వానికి కమిషన్ నివేదిక ద్వారా లభించిన ఆధారాలు, తప్పుడు డిజైనింగ్, దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలు చాలా బలమైనవే. ఇప్పుడు హైకోర్టు స్టే నిరాకరణతో కేసీఆర్, హరీష్‌కు న్యాయ వ్యవస్థ నుంచే మొదటి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఇదంతా చూస్తుంటే… “బహిరంగ సభల్లో నిజం మాట్లాడతామంటారు… న్యాయస్థానంలో మాత్రం దాన్ని ఆపాలని కోరతారు” అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రజల నడుమ సత్యం తేలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కనిపిస్తోంది.