* పాలన వికేంద్రీకరణకు శాసనమండలిలో బ్రేక్
* అనుమతించని చైర్మన్..
* తీవ్ర ఆగ్రహంతో వైసిపి మంత్రుల దాడి
* తాజాగా బయటపెట్టిన ఎంఎ షరీఫ్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఉభయసభల్లోనూ ఈ చట్టబద్ధత బిల్లు పాస్ అయింది. రాష్ట్రపతి త్వరలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పరిణామాన్ని గుర్తు చేసుకున్నారు శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనపై వైసీపీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు దాడి చేసినంత పని చేశారని గుర్తు చేసుకున్నారు. తన గుండెపై చేయి వేసి నెట్టేశారని కూడా చెప్పుకొచ్చారు.
శాసనసభ వరకు ఓకే..
2019లో అధికారంలోకి వచ్చింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. పాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. అందుకు సంబంధించి పాలనా వికేంద్రీకరణ బిల్లును శాసనసభలో పెట్టింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా బలం ఉండడంతో శాసనసభలో ఆ బిల్లు పాస్ అయింది. కానీ అదే బిల్లు శాసనమండలిలో మాత్రం పాస్ కాలేదు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోలేనట్టు శాసనమండలి చైర్మన్ గా ఉన్న ఎంఏ షరీఫ్ తిరస్కరించారు. సెలెక్ట్ కమిటీకి పంపించారు. దీంతో తీవ్ర కోపోద్రిక్తులైన అప్పటి వైసీపీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీలు మండలి చైర్మన్ పోడియం చుట్టూ దూసుకెళ్లారు. ఈ క్రమంలోనే ఒక మంత్రి షరీఫ్ పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. నానా దుర్భాషలాడుతూ అప్పట్లో తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని షరీఫ్ తాజాగా బయటపెట్టారు.
చుట్టుముట్టిన మంత్రులు..
2022 ఆగస్టులో పాలనా వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లు శాసనమండలికి వెళ్ళింది. అధ్యక్ష స్థానంలో ఉన్న ఎంఏ షరీఫ్ వ్యతిరేకించడంతో అప్పట్లో మంత్రులుగా ఉన్న బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్ తదితరులు చాలా దూకుడుగా వ్యవహరించారు. ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ వ్యవహార శైలిపై అప్పట్లో మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. నాడు వైసిపి సభ్యులు వ్యవహరించిన తీరుతో శాసనమండలిలో మైకులు కూడా ధ్వంసం అయ్యాయి. అయితే నాడు తనకు జరిగిన అవమానాన్ని బయటపెట్టారు షరీఫ్.
ఆయన వల్లే అమరావతి సజీవం
ఆరోజు పాలన వికేంద్రీకరణ బిల్లును షరీఫ్ అడ్డుకోకుంటే మాత్రం అమరావతి ఈ స్థాయిలో ఉండేది కాదు. కేవలం సెలెక్ట్ కమిటీకి తిరిగి పంపడంతోనే ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచింది. నాడే పాలనా వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొంది ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఒక విధంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అప్పుడే షాక్ తగిలింది. అందుకే అప్పట్లో సీఎం గా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏకంగా శాసనమండలిని రద్దు చేయాలని సిఫారసు చేసే దాకా పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే శాసనమండలి చైర్మన్ గా ఉన్న ఎంఏ షరీఫ్ తనకు జరిగిన అవమానం గురించి బాహటంగా చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.
