
-
సైకిల్ పై సవారీ తెలంగాణలో వద్దంటున్న కమలనాథులు
-
జనసేనతోనూ పొత్తు వద్దే వద్దంటున్న కాషాయ పార్టీ
-
ఆంధ్ర పార్టీలతో పొత్తు అనే ముద్ర పడుతుందనే భయం వల్లే
-
మునిసిపల్ ఎన్నికల్లో ఒంటరిపోరుకు శ్రేణుల సమాయత్తం
-
ఇకపై అన్నిఎన్నికల్లోనూ సోలోగానే వెళ్లాలనే యోచన
తెలంగాణలో అధికారంలోకి రావాలని ఎప్పటినుంచో కలలు కంటున్న బీజేపీ.. అందుకు అవసరమైన కార్యాచరణ విషయంలో మాత్రం స్పష్టమైన వైఖరితో ముందుకెళ్లలేకపోతోంది. ఒకసారి టీడీపీతో పొత్తు, ఇంకోసారి జనసేతో, మరోసారి ఒంటరిపోరు.. ఇలా రకరకాల విన్యాసాలు చేస్తోంది. అన్ని విధాలుగానూ ప్రయత్నించి చివరకు ఏ వైఖరితో వెళ్లాలో తేల్చుకోలేక సతమతమవుతోంది. వాస్తవానికి 2023 ఎన్నికల్లోనే తెలంగాణలో తాము అధికారంలోకి వస్తామని కమలనాథులు భావించారు. కానీ, ఎన్నికల ప్రక్రియ చివరి దశకు చేరేటప్పటికి వాతావరణం తమకు అనుకూలంగా లేదన్న విషయాన్ని గుర్తించారు.
దీంతో 25 సీట్లయినా వస్తే కీలకం కావచ్చన్న కోణంలో ‘ ప్లాన్-బీ’ని సిద్ధం చేసుకున్నారు. అయితే చివరికి 8 ఎమ్మెల్యే సీట్లకే పరిమితం కావడంతో సైలెంటయిపోయారు. కానీ, పార్లమెంటు ఎన్నికలు వచ్చేటప్పటికి జాతీయ అంశాలు ప్రాధాన్యం సంతరించుకోవడంతో తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా 8 ఎంపీ సీట్లు దక్కించుకున్నారు. దీంతో ఈ సంఖ్యను చూసుకొని రాష్ట్రంలో ఇక తాము బలపడిపోతామని ఆశించారు. ఎనిమిది ఎంపీసీట్లు అంటే 56 అసెంబ్లీ స్థానాల పరిధి కావడంతో రాష్ట్రంలో మెజారిటీ ప్రాంతాల్లో తమదే ఆదిపత్యం అని భావించారు.
8 పార్లమెంటు స్థానాలు గెలిచిన తరువాత రాష్ట్ర బీజేపీ నేతలు ఊహల పల్లకిలో విహరించారు. తమకు ఒంటరిగానే బలం ఉందని, ఇకపై ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగానే బరిలోకి గెలుస్తామనే అంచనాల్లోకి వెళ్లిపోయారు. దాంతోనే ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఒంటరిగా పోటీ చేశారు. కానీ, డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. దీంతో తమ బలమెంత? అన్నది ఆ పార్టీకి ఇప్పుడు అర్థమయిందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి జూబ్లీహిల్స్ లో టీడీపీతోపాటు జనసేనకు కూడా బలం ఉంది. ఉప ఎన్నికలో ఆ పార్టీ మద్దతు తీసుకొని ఉంటే..బీజేపీ బలం పెరిగేది. కానీ, మరో రకంగా నష్టం జరిగేదన్న ఉద్దేశంతో బీజేపీ తెలంగాణ నేతలు.. టీడీపీ, జనసేనకు దూరం పాటించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. టీడీపీతో పొత్తు పెట్టుకున్నందుకు ఆ పార్టీకి ఎదురైన అనుభవమే తమకూ ఎదురవుతుందని వెనకడుగు వేశారు.
టీడీపీని ఆంధ్ర పార్టీ అని పేర్కొంటూ.. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు తమను ప్రజల్లో దోషులను చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుందని తెలంగాణకు చెందిన కమలనాథులు భావించారు. ఇక జనసేనతో పొత్తు పెట్టుకుంటే కొత్తగా వచ్చే ప్రయోజనమేదీ ఉండదని భావించారు. 2023 ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్నా 8 సీట్టకు మించి గెలవలేకపోయిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తెలంగాణలొ సొంతంగా బలపడేందుకే ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించారు.
పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన బీజేపీ.. చెప్పకోదగ్గ స్థాయిలో కాకపోయినా గతంలో కంటే మెరుగైన సంఖ్యలో సర్పంచ్ స్థానాలను దక్కంచుకుంది. దీంతో ఇలాగే ప్రయత్నం చేస్తే మరికొన్నేళ్లకైనా లక్ష్యాన్నిచేరుకోగలమనే ధీమా ఆ పార్టీ నేతలకు కలిగింది. ఈ కారణంగానే త్వరలోజరగనున్న మునిసిపల్ ఎన్నికల్లోనూ ఒంటరిపోరుకే కమలనాథులు మొగ్గు చూపుతున్నారు. ఈ ఎన్నికల్లో తాము కూడా బరిలోకి దిగుతామని జనసేన ప్రకటించగా.. ఆ పార్టీతో పొత్తు తమకు అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పష్టం చేశారు. పట్టణ ప్రాంతాల్లోతాము ఎంతో బలంగా ఉన్నామని, మెజారిటీ మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను తామే కైవసం చేసుకుంటామని అన్నారు.
ఇప్పుడేకాదు.. ఇకపై జరగనున్న ఏ ఎన్నికల్లోనూ తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని ప్రకటించారు. టీడీపీ, జనసేనతో పొత్తు ఏపీకి మాత్రమే పరిమితమని కుండబద్దలు కొట్టారు. ఇదే విషయాన్నిపార్టీ జాతీయ నాయకత్వానికి కూడా చెబుతామన్నారు. బీజేపీ కోణంలో ఇది సరైన విధానమే అయినప్పటికీ.. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఆ పార్టీకి ఇంతకన్నా మించి బలపడే అవకాశాలు ఉంటాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.





