
Food culture: అన్నం అనేది భారతీయ సంస్కృతిలో ఆహార పధార్థం మాత్రమే కాక.. పరబ్రహ్మ స్వరూపంగా భావించబడుతుంది. తిన్నవారిని తృప్తి పరచేందుకు ఆహారం పెట్టడం ఒక్క సేవ కాదు, పుణ్యం కూడా. పరాన్నభోజనం చేసేవారికి కడుపునిండా అన్నం పెట్టడం పూర్వజన్మ సుకృతమని పెద్దలు మాటల్లో చెప్పుకునే మాట కాదు, అనుభవంతో వచ్చిన నిజం. ఒకప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో ఏ విందు జరిగినా అతిథులను గౌరవంగా కూర్చోబెట్టి వండిన పదార్థాలను ఒక్కొక్కటి అడిగి, వారి మనసు కోరినట్లు వడ్డించడం ఆనవాయితీ. మనిషిని కూర్చోబెట్టి తినిపించడం విందుకు ప్రాణం, గౌరవానికి ప్రతీక అని భావించేవారు.
తర్వాత కాలం మారింది. సాంప్రదాయక వడ్డన స్థానంలో సప్లయర్స్ వ్యవస్థ వచ్చి చేరింది. అతిథులను విస్తర్ల లెక్కలో వేసి ఎంతమంది తిన్నారో, ఎన్ని ప్లేట్లు పెట్టామో, ఎంత ఖర్చు అయ్యిందో లెక్కల మధ్య విందుల ఆత్మ మాయమైంది. భోజనం ఒక బాధ్యతగా, ఒక ఖర్చు అంశంగా మారింది. గత దశాబ్దంలో అయితే మరొక కొత్త తరహా మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు పెళ్లిళ్లు, ఫంక్షన్స్, పండుగలు అన్నీ బఫే వ్యవస్థగా మారిపోయాయి. ప్లేటు పట్టుకుని ఐటెమ్స్ కోసం వరుసలో నిలబడి తింటూ అటూ ఇటూ తిరిగే సంస్కృతి మన విందులకు పూర్తిగా చేరిపోయింది.
ఈ బఫే విధానం ఫ్యాషనా, ఫాస్ట్ లైఫ్‌స్టైలా, లేక కొత్త పోకడలా అనేది పక్కన పెడితే.. ఆరోగ్య పరంగా దీనికి మంచికన్నా చెడు ఎక్కువ అని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నిల్చుని తినడం శరీరంపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కూర్చోని తిన్నప్పుడు శరీరం సడలుగా ఉంటే, నిల్చుని తినడం వల్ల కాళ్ల నుంచి పై భాగాలవరకు రక్త ప్రసరణ ఎక్కువగా జరగాలి. ఆ రక్త ప్రవాహాన్ని అందించేందుకు గుండె పనిచేసే వేగం విపరీతంగా పెరుగుతుంది. గుండె స్పందన రేటు పెరిగిపోవడం వల్ల శరీరంపై ఒత్తిడి అధికమై, భోజనం చేసిన వెంటనే అలసట, నీరసం, అసహనం పెరుగుతాయి.
పైగా ప్లేటు ఒక చేతిలో, కంచం ఇంకో చేతిలో పట్టుకుని, శరీరాన్ని నిలువుగా ఉంచుకుని తినడం వల్ల జీర్ణక్రియ శాస్త్ర ప్రక్రియకు ఆటంకం కలుగుతుంది. కడుపు ప్రశాంతంగా పని చేయడానికి శరీరం సడలుగా ఉండాలి. నిలబడినప్పుడు కండరాలు టెన్షన్‌లో ఉండడం జీర్ణ ప్రక్రియను మందగింపజేస్తుంది. దీంతో ఆహారం బాగా జీర్ణం కాకపోవడం, అజీర్ణం, ఆమ్లత్వం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.
ఇంకా ఒక ఆసక్తికరమైన విషయాన్ని పరిశోధనలు చెబుతున్నాయి. మనం నిల్చుని కొద్దిసేపు ఉన్నప్పుడు శరీర శ్రమ ఎక్కువగా ఉండడంతో నాలుకపై ఉండే రుచి గ్రంధులు, రుచిమొగ్గలు సున్నితత్వం కోల్పోతాయి. అందుకే బఫేలో నిల్చుని తినే వారు ఆహారం రుచిగా లేదని భావిస్తారు. అదే పదార్థం కూర్చుని తింటే రుచి పూర్తిగా తెలుస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం.. నిల్చుని తినడం వల్ల నాలుక రుచి సిగ్నల్స్‌ను మెదడు సరైనంత బాగా గ్రహించదు. ఫలితంగా ఆహారం రుచికరమైనా, మనకు రుచిగా అనిపించదు.
మన పూర్వీకులు భోజనాన్ని కేవలం కడుపునిండడానికి కాక మానసిక ప్రశాంతతకు కూడా ఉపయోగించే పద్ధతిగా భావించారు. అందుకే భోజనం తప్పనిసరిగా కూర్చునే పద్ధతిలోనే చేశారు. నేలమీద కూర్చుని తినడం శరీరాన్ని స్థిరంగా ఉంచి జీర్ణక్రియను సహజంగా కొనసాగిస్తుంది. విందుల్లో, వేడుకల్లో బఫేల మోజులో మనం కోల్పోతున్నది కేవలం ఆచారమే కాదు, ఆరోగ్యమూ అని చెప్పాలి.
ALSO READ: Motion Sickness: ప్రయాణంలో వచ్చే వాంతులను ఆపడం ఎలా?





