ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన రెండో టీ20లో భారత్ ఈజీ విజయాన్ని సాధించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ చెలరేగి ఆడటంతో విజయం భారత్ ను వరించింది. కివీస్‌తో తొలి టీ20లో ధాటిగా ఆడి 32 పరుగులు చేసిన సూర్య కుమార్.. రెండో మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన సూర్య.. చివరి వరకు అజేయంగా నిలిచి జట్టును గెలిపించాడు.
దుమ్మురేపిన ఇషాన్ కిషన్!
అటు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా సుడిగాలి ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తొలి టీ20లో 8 పరుగులకే వెనుదిరిగిన ఇషాన్.. కానీ రెండో మ్యాచ్‌లో ఇషాన్ చెలరేగి ఆడాడు. 209 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పేలవంగా ఇన్నింగ్స్‌ను ఆరంభించిన జట్టును.. మెరుపు ఇన్నింగ్స్ తో గెలుపు బాట పట్టించింది అతనే. జట్టు ఇబ్బందుల్లో ఉండగా, గత మ్యాచ్ వైఫల్యం వెంటాడుతుండగా వచ్చి ఇలాంటి విధ్వంసక ఇన్నింగ్స్ ఆడడం సామాన్యమైన విషయం కాదు. కానీ ఇషాన్ మాత్రం అలవోకగా భారీ షాట్లు ఆడాడు. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరి బౌలింగ్‌నూ తుత్తునియలు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో అతను స్విచ్ షాట్ కూడా ఆడాడు.
మ్యాచ్ రూపాన్ని మార్చిన ఇషాన్!
ఇషాన్ ఇన్నింగ్స్ తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. చాలా ముందే జట్టు విజయం ఖాయమైపోయింది. 8వ ఓవర్లోనే ఇషాన్ 70ల్లోకి వచ్చేయడంతో ఇషాన్ సెంచరీ చేస్తాడనిపించింది. కానీ ఆ మార్కు అందుకోకపోయినా.. పునరాగమనంలో ఇషాన్ కెరీర్‌కు ఈ ఇన్నింగ్స్ సూపర్ బూస్ట్ ఇచ్చింది. సిరీస్‌లో ఇంకో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడంటే ప్రపంచ కప్ నకు తిలక్ అందుబాటులోకి వచ్చినా.. ఇషాన్‌ను తుది జట్టులో ఆడించక తప్పదు.





