
Emotional Incident: మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా గంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హృదయాన్ని కలచివేసే విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఉన్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడి తన జీవితానికి ముగింపు పలికింది. తన చేతిపై ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’ అంటూ రాసుకుని ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కంటతడి పెట్టించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధ్రువ్ నగర్‌కు చెందిన దీక్షా త్రిభువన్ (21) పుట్టుకతోనే దివ్యాంగురాలు. మాట్లాడటంలో కూడా ఆమెకు ఇబ్బందులు ఉండేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల 30 నిమిషాల సమయంలో ఇంట్లో ఎవరూ లేని వేళ ఫ్యాన్‌కు ఉరివేసుకుని దీక్షా ఆత్మహత్య చేసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించగా ఆమె చేతిపై రాసుకున్న చివరి మాటలు పోలీసులకే కాదు.. అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికీ కన్నీళ్లు తెప్పించాయి. అమ్మా నాన్న నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను క్షమించండి అంటూ ఆమె రాసుకున్న వాక్యాలు కుటుంబాన్ని మరింత విషాదంలోకి నెట్టాయి.
తమ కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. దీక్ష ఎప్పుడూ ధైర్యంగా ఉండేదని, అందరితో స్నేహంగా మెలిగేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆమెనే తమ భవిష్యత్తుగా భావించామని, ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అసలు ఊహించలేదని కన్నీటితో చెబుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం దివ్యాంగురాలిగా ఉండటం వల్లే దీక్ష మానసిక ఒత్తిడికి లోనై ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆమె ఆత్మహత్యకు గల అసలు కారణాలపై పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు.
ALSO READ: Madaram: సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద జాగ్రత్త.. తలలు పగులుతున్నాయి





