
Nikki Haley ON Indian: భారత్ లాంటి బలమైన మిత్రదేశాన్ని అమెరికా దూరం చేసుకోవద్దని భారత సంతతికి చెందిన రిపబ్లికన్ లీడర్ నిక్కీ హేలీ సూచించారు. భారత్ తమకు మంచి భాగస్వామి కాదంటూ, సుంకాల భారాన్నీ పెంచుతానని ట్రంప్ హెచ్చరికలు చేసిన నేపమథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి.
చర్చనీయాంశంగా మారిన నిక్కీ కామెంట్స్
రష్యా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేయకూడదు కానీ, చైనా చేయొచ్చా? అని నిక్కి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. రష్యా, ఇరాన్ నుంచి అత్యధిక ఆయిల్ కొనుగోలు చేస్తున్న చైనాకు సుంకాల నుంచి 90 రోజులు మినహాయింపు ఇచ్చారంటూ ట్రంప్ పై పరోక్షంగా విమర్శలు చేశారు. చైనాకు ఇలాంటి అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి బలమైన మిత్రదేశంతో సంబంధాలను దూరం చేసుకోవద్దని సూచించారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన హేలీ.. ట్రంప్ మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా ఉన్నారు. 2024లో అధ్యక్ష అభ్యర్థి రేసులోకి దిగిన ఆమె, ఆ తర్వాత ట్రంప్ నకు మద్దతు తెలిపారు.
ట్రంప్ టారిఫ్ బెదిరింపులు
అటు భారత్‌ను తమ మిత్రదేశం అని చెప్పిన ట్రంప్, తాజాగా మంచి భాగస్వామి కాదని వ్యాఖ్యానించారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేస్తందనే కారణంతో 25 శాతం సుంకంతో పాటు పెనాల్టీలు విధిస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఆ టారిఫ్ లను మరింత పెంచుతానని హెచ్చరించారు. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేయడం వల్ల వారు ఉక్రెయిన్ తో యుద్ధం చేయడానికి సహకరిస్తున్నట్లవుతుందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో రష్యా భారత్ కు మద్దతుగా నిలిచింది. తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు వీలుగా వాణిజ్య, ఆర్థిక భాగస్వాములను ఎంచుకునే హక్కు సార్వభౌమ దేశాలకు ఉంటుందని తేల్చి చెప్పింది. భారత్ కూడా దేశ ప్రయోజనాల కోసం తగిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తమకు ఉంటుందని వెల్లడించింది.
Read Also: నాటి న్యూస్ క్లిప్ షేర్ చేస్తూ.. ట్రంప్ పై ఇండియన్ ఆర్మీ ఆగ్రహం!