
ఆరోగ్యంగా జీవించాలంటే రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న విషయాలకే పెద్ద ప్రాధాన్యం ఉంటుంది. అందులో ముఖ్యమైనది నీళ్లు తాగడం. మానవ శరీరంలో సుమారు 60 నుంచి 70 శాతం వరకు నీరే ఉండటం వల్ల, శరీర వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే తగినంత నీటి అవసరం తప్పనిసరి. అందుకే వైద్యులు ప్రతిరోజూ కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగాలని సూచిస్తుంటారు. ఈ నేపథ్యంలో చాలామంది పడుకునే ముందు కూడా నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే ఈ అలవాటు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే నిద్రకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పడుకునే ముందు నీళ్లు తాగడం వల్ల శరీరానికి అనేక విధాలుగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రోజంతా శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపే ప్రక్రియకు ఇది సహాయపడుతుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతుంది. దీనివల్ల శరీరం చల్లబడుతూ రిలాక్స్‌డ్‌గా మారి, రాత్రిపూట నిద్ర నాణ్యత మెరుగుపడే అవకాశాలు ఉంటాయి. గోరువెచ్చని నీళ్లు తాగితే కండరాల్లోని ఒత్తిడి తగ్గి, నొప్పులు ఉపశమనం పొందుతాయి. అదే సమయంలో జీర్ణక్రియ చురుకుగా పనిచేయడానికీ ఇది దోహదపడుతుంది. కొందరు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మం కూడా ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.
అయితే పడుకునే ముందు అవసరానికి మించి నీళ్లు తాగితే కొన్ని సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నోక్టురియా అనే సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల రాత్రిపూట తరచూ మూత్ర విసర్జనకు లేవాల్సి రావడం జరుగుతుంది. ఫలితంగా నిద్ర మధ్యలో అంతరాయం కలిగి పూర్తిస్థాయి విశ్రాంతి దొరకదు. సరైన నిద్ర లేకపోవడం వల్ల మరుసటి రోజు అలసట, తలనొప్పి, చిరాకు, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంగా ఇదే పరిస్థితి కొనసాగితే గుండె ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అందువల్ల పడుకునే ముందు నీళ్లు తాగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు. నీళ్లు తాగిన వెంటనే నిద్రపోవడం మంచిది కాదని, కనీసం నిద్రపోయే రెండు గంటల ముందే నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన గంట తర్వాత కొద్దిగా నీళ్లు తాగితే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. పడుకునే సమయంలో దాహంగా అనిపిస్తే పెద్ద గ్లాసు నీళ్లు తాగడం కంటే కొన్ని సిప్స్ మాత్రమే తాగడం ఉత్తమం. నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న విషయం వాస్తవమే అయినా.. అదే సమయంలో నిద్రకు భంగం కలగకుండా సమతుల్యంగా ఈ అలవాటును పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.
ALSO READ: Phone Tapping Case: సిట్ విచారణకు కేసీఆర్.. కవిత ఏమన్నారంటే?





