• మునిసిపల్ ఎన్నికల్లో బీజేపీలో ఇష్టారాజ్యం
• ప్రత్యర్థి పార్టీలతో నాయకుల అనైతిక పొత్తులు
• ఇటు కాంగ్రెస్ కు, అటు బీఆర్ఎస్ కు మద్దతు
• ప్రత్యర్థికి ఎక్స్ అఫీషియో ఓటు వేసిన ఓ ఎంపీ
• రాష్ట్ర నేతలపై బీజేపీ అధిష్ఠానం సీరియస్
• పార్టీ లైన్ దాటినవారిపై క్రమశిక్షణ చర్యలు?
• నేడు నివేదిక పంపనున్న రాష్ట్ర నాయకత్వం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికలు.. బీజేపీలో పెద్ద కల్లోలాన్నే సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి.. రాష్ట్రంలో బలపడేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండింటికీ సమదూరం పాటించాలన్న నాయకత్వం నిర్ణయానికి విరుద్ధంగా కొందరు ఆ రెండు పార్టీలతోనూ చేతులు కలిపారు. దీనిని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. త్వరలోనే కొందరు నేతలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని అంటున్నారు.
బీజేపీ అంటే సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే పార్టీగా పేరుంది. గెలుపోటములు తమకు విషయమే కాదని, నైతికతతో కూడిన రాజకీయాలే తమ లక్ష్యమని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. అయితే తెలంగాణలో జరిగిన మునిసిపల్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ నాయకులు వీటికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు. ఒక్కో మునిసిపాలిటీలో ఒక్కో రకంగా వ్యవహరించారు.
మునిసిపల్ చైర్మన్ పదవి తమకు దక్కే అవకాశం లేకపోయినా ఏకకాలంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో చేతులు కలిపారు. బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు కూడా మద్దతు పలికి ఆ పార్టీ గెలుపునకు సహకరించారు. కొన్నిచోట్లనైతే పార్టీ రెండుగా చీలిపోయి.. కొందరు సభ్యులు అధికార పార్టీకి, మరికొందరు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు.
దీంతో బీజేపీ పరిస్థితి ఆ రెండు పార్టీలకు ఆటలో అరటిపండులా మారిపోయింది. కొన్ని చోట్ల వైస్ చైర్మన్ పదవుల కోసం కూడా ప్రత్యర్థితో చేతులు కలిపింది. ఈ పరిణామాలతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడగా.. నాయకత్వం స్టాండ్ ఏమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
• ఎంపీల తీరుతో గందరగోళం..
మునిసిపాలిటీల్లో ఎక్కడికక్కడ స్థానిక నేతలు తమకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటే.. ఎంపీల స్థాయిలో కూడా పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరించడం తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతుందోనన్న చర్చను లేవనెత్తింది. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ల వ్యవహార శైలే ఇందుకు కారణం.
మెదక్ జిల్లాలోని ఇస్నాపూర్ లో రఘునందన్ రావు బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా తన ఎక్స్ అఫీషియో ఓటు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. నిజానికి అక్కడ బీజేపీ కౌన్సిలర్లు ఒక్కరు కూడా గెలవలేదు. అయినా రఘునందన్ రావు తన ఓటును అక్కడ నమోదు చేసుకున్నారు. చైర్మన్ ఎన్నికకు స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి ఒకే కారులో వచ్చి తన ఓటు వేశారు.
అయితే ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం నిర్ణయం మేరకే తాను బీఆర్ఎస్ కు ఓటు వేశానని చెప్పారు. మరోవైపు ఈటల రాజేందర్.. తన పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లంపల్లిలో ఎక్స్ అఫీషియో ఓటు నమోదు చేసుకున్నారు. అయితే మునిసిపల్ చైర్మన్ ఎన్నికకు ఆయన హాజరుకాలేదు.
• అధిష్ఠానం సీరియస్..
తెలంగాణలో మునిసిపాలిటీ చైర్మన, వైస్ చైర్మన ఎన్నికల్లో ప్రత్యర్థులతో సొంత పార్టీ ముఖ్య నేతలు చేతులు కలపడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. అనైతిక పొత్తులు కుదుర్చుకున్న సీనియర్ నేతలు, ప్రజా ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పని చేశారని అందిన సమాచారాన్ని తీవ్రంగా పరిగణిస్తన్న అధిష్ఠానం.. ధిక్కారానికి పాల్పడిన వారిపై క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది.
అనైతిక పొత్తులపై తక్షణం నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఆదేశించింది. మునిసిపాలిటీలను బట్టి వేర్వేరుగా వ్యవహరించడం, హంగ్ మునిసిపాలిటీలలో అవకాశాలు వదులుకోవడం, అధిక స్థానాలు గెలుచుకున్న చోట్ల చైర్మన పదవిని ఎందుకు వదులుకున్నారన్న అంశాలపై అధిష్టానం ఆరా తీసినట్లు సమాచారం.
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. మునిసిపల్ ఛైర్మన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎ్‌సలకు మద్ధతు ఇవ్వడాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం సీరియ్‌సగా తీసుకుంది. రాష్ట్ర పార్టీకి కనీస సమాచారం ఇవ్వకుండానే.. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడి అనుమతి తీసుకున్నాకే బీఆర్‌ఎ్‌సకు ఓటు వేశామని కొంతమంది ముఖ్యనేతలు మీడియాకు చెప్పడం రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని బద్నాం చేసే కుట్రలో భాగమే నని భావిస్తోంది.
నాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చోటు చేసుకున్న ఘటనలతో పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడిందన్నఅభిప్రాయానికి వచ్చింది. ఇది ఎంత మాత్రం క్షమార్హం కాదని రాష్ట్ర బీజేపీ ముఖ్య నేతలతో జాతీయ కీలక నేత అన్నట్లు సమాచారం.
అధిష్టానం ఆదేశాల మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వం గురువారం ఢిల్లీకి సమగ్ర నివేదిక పంపనున్నట్లు తెలిసింది. ఈ నివేదిక పరిశీలించాక జాతీయ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్నది ఉత్కంఠగా మారింది.
