
క్రైమ్ మిర్రర్, చౌటుప్పల్ ప్రతినిధి : మర్రిగూడ మండలంలో ఇటీవల ముగిసిన గ్రామపంచాయతీ ఎన్నికలు స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. స్థానిక శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికు చెందిన వ్యక్తిగత సహాయకుడు (పీఏ) పలు గ్రామాల్లో చేసిన జోక్యాలు చివరకు ఆయనకు, పార్టీకి ఇబ్బందికరంగా మారాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్థుల ఎంపికలో తన అనుచరులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని వార్డు మెంబర్ అభ్యర్థులుగా నిలబెట్టడం వంటి చర్యలు ఎన్నికల ఫలితాల్లో స్పష్టంగా ప్రతిబింబించాయన్న విశ్లేషణ వినిపిస్తోంది.
Read Also : BRSParty : సస్పెన్షన్ల తర్వాత బిఆర్ఎస్‌లో క్రమశిక్షణ పునరుద్ధరణ యత్నం..
ముఖ్యంగా పీఏ ప్రభావంతో టికెట్లు పొందిన పలువురు అభ్యర్థులు ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సొంత గ్రామంలోనే పీఏ జోక్యంతో నిలబెట్టిన అభ్యర్థులు ప్రజాదరణ లేకపోవడంతో భంగపడ్డారని స్థానిక నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే చౌటుప్పల్, నారాయణపురం, మర్రిగూడ మండల గ్రామపంచాయతీలోనూ ఇదే పరిస్థితి కనిపించిందని, గత 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన సీనియర్ నాయకులను పక్కనపెట్టి కొత్తవాళ్లకు అవకాశం ఇవ్వడం తిరస్కరణకు గురైందన్న వాదన వినిపిస్తోంది.
Read Also : Sarpanch: శివన్నగూడలో పాలనా దిశ మారుతోందా..?
ఈ ఎన్నికల ఫలితాలు ఒక స్పష్టమైన సంకేతం ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గ్రామస్థాయిలో ప్రజలు వ్యక్తుల్ని కాదు, సేవను, నమ్మకాన్ని చూసి ఓటేస్తారన్న నిజాన్ని పీఏ రాజకీయాలు విస్మరించాయని వారు అభిప్రాయపడుతున్నారు. వ్యక్తిగత సహాయకులు రాజకీయ నిర్ణయాల్లో హద్దులు దాటితే, ఆ ప్రభావం చివరకు పార్టీకి నష్టంగా మారుతుందన్న హెచ్చరికగా ఈ ఫలితాలను చూడాలన్న సూచనలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలపై ఎమ్మెల్యే స్థాయిలో సమీక్ష జరగకపోతే, భవిష్యత్తులో ఇలాంటి భంగపాట్లు మరింత తీవ్రమయ్యే అవకాశముందన్నది రాజకీయ వర్గాల స్పష్టమైన విశ్లేషణ.





