
Telangana BJP: తెలంగాణ బీజేపీలో అగ్రనేతల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీని దక్కించుకుంది. పెద్దల సభలో అడుగుపెట్టింది కమలం పార్టీ. మరి…. ఇంతటి విజయానికి కారణం ఎవరు..? ఈ క్రెడిట్ ఎవరికి దక్కుతుంది..? రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి నాయకత్వానికా…? లేక… బండి సంజయ్ పనితీరుకా..? పార్టీ శ్రేణులు ఏమంటున్నారు…? బీజేపీ అధిష్టానం ఆ క్రెడిట్ ఎవరికి ఇస్తుంది.
తెలంగాణలో ఒక గ్రాడ్యుయేట్, రెండు టీచర్ ఎమ్మెల్సీ స్థానలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి విజయం సాధించారు. ఇదే జిల్లాకు చెందిన టీచర్ ఎమ్మెల్సీలో కూడా కమలం పార్టీదే విజయం. కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య విజయం సాధించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అయినా, టీచర్ ఎమ్మెల్సీ అయినా… కరీంనగర్ జిల్లాకు చెందినవే. అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ నియోజకవర్గం. బండి సంజయ్ నాయకత్వం… ఆయన ముందుండి నడిపించడం వల్లే.. ఈ రెండు ఎమ్మెల్సీలను బీజేపీ గెలుచుకుందని టాక్ నడుస్తోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలంగాణలో బీజేపీ సత్తా చాటుతోంది. రోజురోజుకూ పుంజుకుంటోంది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో… 8 సీట్లు సాధించింది. 15 స్థానాల్లో రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి అన్ని సీట్లు.. ఓట్లు రావడం రికార్డే. ఇక.. లోకసభ ఎన్నికల్లోనూ బీజేపీ మరోసారి తన బలం నిరూపించుకుంది. 17 స్థానాల్లో బీజేపీ 8 సీట్లు సొంతం చేసుకుంది. అసెంబ్లీలో బీజేపీ ప్రాతినిధ్యం ఉన్నా… మండలిలో మాత్రం బీజేపీ సభ్యులు లేరు. ఈ వెలితి ఇప్పుడు తీరిపోయింది. ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీని గెలుచుకున్న బీజేపీ… మండలిలో స్థానం దక్కించుకుంది. పెద్దల సభలో తన గళం వినిపించబోతోంది. అయితే ఈ క్రెడిట్ ఎవరిది…? అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కిషన్‌రెడ్డిదా…? రెండు ఎమ్మెల్సీలు కరీంనగర్‌కు చెందినవే కనుక… ఈ నియోజకవర్గ బాధ్యతలు చేస్తున్న బండి సంజయ్‌దా…? ఈ విషయంలో బీజేపీలోనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కిషన్‌రెడ్డి నాయకత్వ లక్షణాలు… ఆయన వ్యూహాల వల్లే… రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించిందని వార్తలు వస్తున్నాయి. బీజేపీలోని ఓ వర్గం వాదన కూడా ఇదే. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఆయన కనుక.. క్రెడిట్ ఆయనకే రావాలని అంటున్నారు. అయితే… మరోవర్గం మాత్రం ఇదంతా బండి సంజయ్ కృషి వల్లే సాధ్యమైందని అంటోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మెదక్ జిల్లాకు చెందిన అంజిరెడ్డిని ఖరారు చేసినా… పట్టించుకోకుండా… పార్టీ గెలుపుపైనే బండి సంజయ్ దృష్టిపెట్టారని చెప్తున్నారు. కాంగ్రెస్‌పై ఘాటైన విమర్శలు చేస్తూ… ప్రచారంలో దూసుకెళ్లారని అంటున్నారు. అంతేకాదు.. 40శాతానికిపైగా ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఓట్లు కూడా ఈ గెలుపునకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే… క్రెడిట్ బండి సంజయ్‌కే రావాలని అంటున్నారు. పార్టీ నేతల అభిప్రాయాలు ఇలా ఉంటే… మరి హైకమాండ్ ఏం ఆలోచిస్తోంది అన్నది.. చూడాలి.
త్వరలో తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడిని నియమించబోతుంది బీజేపీ అధిష్టానం. అందుకు… ఈ ఎన్నికలను ప్రామాణికంగా తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయానికి బండి సంజయ్ పాత్రే ఎక్కువగా ఉందని హైకమాండ్ భావిస్తే… ఆయనకే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను అప్పగించవచ్చు. గతంలో… బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా తప్పించిన సమయంలో అధిష్టానం నిర్ణయాన్ని చాలా మంది తప్పుబట్టారు. కనుక… మరోసారి బండి సంజయ్‌కి అవకాశం కల్పించే ఛాన్స్ ఉంది. బీజేపీ హైకమాండ్ ఆలోచన ఏ విధంగా ఉందో చూడాలి.