పుష్ప హీరో అల్లు అర్జున్, తెలంగాణ కాంగ్రెస్ మధ్య సాగుతున్న వార్ లో మరో కీలక పరిణామం జరిగింది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఘటన జాతీయ మీడియాలో సంచలనంగా మారింది. దాడికి పాల్పడిన నిందితులు సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు కావడంతో.. ఈ అంశాన్ని నేషనల్ మీడియా వైరల్ చేస్తోంది. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ నేతలపై పార్టీ హైకమాండ్ ఆగ్రహం వ్యక్తం చేసిందని తెలుస్తోంది. అసలు తెలంగాణలో ఏం జరుగుతుందని పార్టీ పెద్దలు ఆరా తీశారని సమాచారం.
హైకమాండ్ ఆదేశాలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక అల్లు అర్జున్ ఎపిసోడ్‌లో ఎవరూ మాట్లాడకూడదని సీరియస్ అయ్యారు. మీడియా సమావేశాలు, చర్చల్లో ఎక్కడ కూడా ఆ విషయం మాట్లాడవద్దని తెలిపినట్టు సమాచారం. పార్టీ నాయకులు అందరికీ ఈ విషయం సూచించాలని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు సీఎం ఆదేశాలు జారీ చేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో చివరి రోజున సీఎం రేవంత్ రెడ్డి.. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకపై ఎలాంటి ప్రత్యేక షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆ విషయంపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి తన వ్యక్తిత్వాన్ని కించపరిచేలా అబద్దపు ప్రచారాలు చేస్తున్నారంటూ మాట్లాడారు. ఈ మొత్తం వ్యవహారంపై కాంగ్రెస్ నాయకులు అల్లు అర్జున్ పై మాటల దాడికి దిగారు. పార్టీలోని ముఖ్యమైన నేతలంతా బన్నీపై దుమ్మెత్తి పోశారు. ఈ విషయం జాతీయ మీడియాకు కూడ చేరడంతో.. రేవంత్ రెడ్డి అప్రమత్తమై.. ఇకపై నేతలెవరూ అల్లు అర్జున్ ఎపిసోడ్ పై మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.