-
మర్రిగూడ ఎంపిడివో కార్యాలయంలో రచ్చ
-
అధికారుల తీరుపై నూతన సర్పంచ్‌ల ఆగ్రహం
మర్రిగూడ, (క్రైమ్ మిర్రర్):- మండల కేంద్రంలోని ఎంపిడివో కార్యాలయం వేదికగా జరిగిన, నూతన సర్పంచ్‌ల సన్మాన కార్యక్రమం వాడివేడిగా సాగింది. ఒకవైపు అధికారిక సన్మానాలు జరుగుతుండగానే, మరోవైపు మండల అధికారుల పనితీరుపై, సర్పంచ్‌లు నిలదీయడంతో వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.
సన్మాన గ్రహీతలుగా వచ్చిన మేటిచందాపురం సర్పంచ్ పదం రవి, శివన్నగూడెం సర్పంచ్ రాపోలు యాదగిరి, యరుగండ్లపల్లి సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ అధికారుల వ్యవహారశైలిపై మండిపడ్డారు. మండల అభివృద్ధి పనుల్లో అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందని, క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవడం లేదని వారు ధ్వజమెత్తారు.
ఇందిరమ్మ ఇండ్లు.. పైరవీల అడ్డా!:
ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు అంశంపై, సర్పంచ్‌లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అర్హులకు కాకుండా పైరవీకారులకే ఇండ్లు దక్కుతున్నాయని, ఇది సామాన్యుల్లో ప్రభుత్వంపై నమ్మకాన్ని పోగొడుతోందని ఆరోపించారు. గ్రామంలో ప్రజలు తమను నిలదీస్తున్నారని, ఇండ్ల కేటాయింపులో పారదర్శకత లేకపోవడం వల్ల, తాము ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసేలా, అభివృద్ధికి సహకరించేలా అధికారులు వ్యవహరించాలని సర్పంచ్ పదం రవి డిమాండ్ చేశారు.
సమన్వయంతోనే అభివృద్ధి:
అధికారులు, సర్పంచ్‌ల మధ్య సమన్వయం ఉంటేనే గ్రామాలు బాగుపడతాయని, నిధుల వినియోగం నుంచి పథకాల అమలు వరకు తమకు పూర్తి సహకారం అందించాలని నూతన సర్పంచ్‌లు కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు..





