
క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు మంత్రులు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు నిన్న స్టే విధించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు వెళ్తామని చెప్పుకొస్తున్నారు. అయితే నేడు బీసీ రిజర్వేషన్ల జీవోపై కోర్టు స్టే విధించిన నేపథ్యంలో తర్వాత ఏం చేయాలనే ఆలోచనలతో నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొంతమంది మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో భేటీ నిర్వహిస్తున్నారు. కోర్టు స్టే విధించగా దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలా లేదా హైకోర్టును గౌరవించి తుది తీర్పు వచ్చే వరకు వేచి చూడాలా అనే దానిపై కీలక చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. హైకోర్టు ఇచ్చినటువంటి స్టే ఉత్తర్వులను పూర్తిగా అధ్యయనం చేసి, న్యాయ నిపుణుల సలహా మేరకు తదుపరి కార్యచరణ పై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
Read also : ఏసీబీ వలలో రెవిన్యూ తిమింగలం..! లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎమ్మార్వో
కాగా మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా నేడు తెలంగాణ రాజ్యాధికారి పార్టీ (TRP) చీఫ్ తీన్మార్ మల్లన్న బందుకు పిలుపునిచ్చారు. బలహీనమైనటువంటి జీవో నెంబర్ 9 తో సీఎం రేవంత్ రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని, దానికి బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ హైకోర్టు స్టే పై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూసి ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా బందుకు పిలుపునిస్తామని మరోవైపు ఎంపీ కృష్ణయ్య తెలిపారు. దీంతో రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లపై మరింత అగ్గి రాచుకోనుంది.
Read also : మ్యూజిక్ లోనే కాదు బ్యాటింగ్ లోనూ దంచికొడుతున్నాడు… 39 బంతుల్లోనే సెంచరీ..!