
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే పర్యటనలో ఏ లీడర్ ఎటువైపు ఉందో తేలిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి టీం ముందే అంతా కసరత్తు చేసి.. మల్లికార్జున ఖర్గే ముందే తన ఆధిపత్యం చాటుకుందనే చర్చ సాగుతోంది. తనకు పోటీగా ఉంటారని భావించిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఖర్గే ముందే దోషిగా నిలబెట్టడంలో సీఎం రేవంత్ సక్సెస్ అయ్యారనే టాక్ గాంధీభవన్ లో సాగుతోంది. ఖర్గే పర్యటనకు రెండు రోజుల ముందు.. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన కోవర్టు కామెంట్ల వెనుక సీఎం రేవంత్ టీం ఉందంటున్నారు. పొంగులేటి టార్గెట్ గానే అనిరుధ్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేయగా.. అవన్ని ఖర్గే దృష్టికి వెళ్లాయంటున్నారు. దీంతో పీఏసీ సమావేశంలో మంత్రి పొంగులేటిపై ఖర్గే సీరియస్ అయ్యారని తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచారనే చర్చ జిల్లాలో సాగుతోంది. నిజానికి 2023 ఆరంభంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రాష్ట్రంలో అంతంత మాత్రంగానే ఉంది. అప్పటి అధికార బీఆర్ఎస్ కు పోటీగా బీజేపీనే కనిపించింది. దుబ్బాక, హుజారాబాద్, మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్.. అసలు రేసులోనే లేదు. కాని గతంలో కాంగ్రెస్ ను వీడిన నేతలు తిరిగి సొంతగూటికి రావడంతోనే కాంగ్రెస్ కు ఊపు వచ్చింది. అదే అధికారంలోకి రావడానికి కారణమైంది. పొంగులేటి చేరికలో ఖమ్మంలో జిల్లాలో హస్తం పార్టీకి బూస్ట్ వచ్చింది. జూపల్లి చేరికతో పాలమూరు జిల్లాలో పార్టీకి ప్రాణం వచ్చింది. రాజగోపాల్ రెడ్డి జాయిన్ కావడంతో నల్గొండ జిల్లాలో వార్ వన్ సైడ్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఈ చేరికలే కీలకమయ్యాయి. అయితే ఇప్పుడు సీన్ మారిపోయినట్లు కనిపిస్తోంది. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ పెద్దలు టార్గెట్ చేశారని అంటున్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరినప్పుడే రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చారు. లోక్ సభ ఎన్నికల సమయంలోనూ తన సన్నిహితుడైన చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవడానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే అంతా తానే వ్యవహరించి భువనగిరిలో చామలను గెలిపించారు రాజగోపాల్ రెడ్డి. నిజానికి భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుస్తారనే సర్వేలు అంచనా వేశాయి. కాని రాజగోపాల్ రెడ్డి సీరియస్ గా వర్క్ చేయడంతో పరిస్థితి మారిపోయింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి మంచి మెజార్టీతో గెలిచారు. రాజగోపాల్ రెడ్డి వల్లే భువనగిరి గెలిచామని సీఎం రేవంత్ రెడ్జి కూడా చెప్పారు. కాని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రిపదవి విషయంలో మాత్రం ఆయన పట్టించుకోవడం లేదని అంటున్నారు.
పార్టీలో చేరినప్పుడు ఇచ్చిన హామీ మేరకు వివేక్ కు మంత్రి పదవి ఇచ్చారు. ఎస్సీల్లో ఇద్దరు మంత్రులు ఉన్నా వివేక్ కు అవకాశం ఇచ్చారు. వివేక్ కోసం మరో మాదిగకు కేబినెట్ లో చోటు ఇచ్చారు. కాని రాజగోపాల్ రెడ్డికి మాత్రం ఇవ్వలేదు. ఇక్కడే సీఎం రేవంత్ రెడ్డి గేమ్ ఆడారని చెబుతున్నారు. రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకోవడం ఇష్టం లేకే.. సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి పేర్లను ఆయన తెరపైకి తెచ్చారని తెలుస్తోంది. దీంతో రెడ్లకు సంబంధించి పోటీ పెరగడంతో రాజగోపాల్ రెడ్డికి బెర్త్ దక్కలేదని అంటున్నారు. రంగారెడ్డి,నిజామాబాద్ జిల్లాల నుంచి మంత్రివర్గంలో ఎవరు లేరు. అలాంటి సమయంలో ఆ జిల్లాల నేతలను కాదని రాజగోపాల్ రెడ్డికి ఇస్తే మంచిది కాదని పార్టీ పెద్దలకు రేవంత్ చెప్పారని చెబుతున్నారు. అందుకే రాజగోపాల్ రెడ్డికి గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రిపదవి ఇవ్వాలని హైకమాండ్ భావించినా.. సీఎం రేవంత్ రెడ్డి వేసిన స్కెచ్ తో సీన్ మారిపోయిందని అంటున్నారు.