
నల్గొండ జిల్లా నకిరేకల్ లో పదవ తరగతి పరీక్ష పేపర్ లీక్ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. పేపర్ లీక్ కేసులో విచారణ జరుపుతున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోనికి వచ్చాయని తెలుస్తోంది. నకిరేకల్ టెన్త్ క్లాస్ పేపర్ లీక్ వెనుక అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పర్సనల్ సెక్రటరీ హస్తం ఉందని తెలుస్తోంది. టెన్త్ క్లాస్ క్వశ్చన్ పేపర్‌ను సదరు ఎమ్మెల్యే పీఏ వాట్సాప్‌లో లీక్ చేసినట్లు సమచారం. అయితే ఎఫ్ఐఆర్‌లో అతని పేరు రాకుండా ఎమ్మెల్యే చత్రం తిప్పారనే టాక్ వస్తోంది. గౌతమి హై స్కూల్ ప్రిన్సిపాల్ గునుగుంట్ల శంకర్‌తో ఎమ్మెల్యే పీఏ పేపర్ లీక్ డీల్ కుదుర్చుకున్నారని అంటున్నారు.
తెలుగు పరీక్ష మొదలయిన 5 నిమిషాల్లోనే వాట్సాప్‌లో పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ దందా కోసం తన వెంట తిరిగే కాలేజీ పిల్లల్ని, మైనర్‌లను నిందితుడు వాడుకున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. రాయితో కొడతానని పరీక్ష రాస్తున్న బాలికను బెదిరించి పేపర్‌ను ఫోటో తీసుకున్నారు నిందితులు.పేపర్ లీక్ కేసులో తన పేరు రాకుండా పోలీసులను మీడియాను సదరు నిందితుడు బెదిరించారని తెలుస్తోంది. ప్రధాన నిందితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఉండటంతో మొక్కుబడిగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read More : నెల రోజులైనా దొరకని కార్మికులు..SLBC టన్నెల్ క్లోజేనా?
టెన్త్ పేపర్ లీకేజ్ పై కేసులో 12 మంది పై కేసులు నమోదు చేసిన పోలీసులు.. అందులో 6 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అరెస్టైన వారిలో ప్రైవేట్ స్కూల్ టీచర్ గునుగుంట్ల శంకర్, జిరాక్స్ సెంటర్ నిర్వాహకుడు బ్రహ్మదేవర రవిశంకర్, చిట్ల అశోక్, బండి శ్రీను, చిట్ల శివ, ఒక బాలుడు ఉన్నారు. మిగిలిన నిందితుల్లో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు అధికారులు, సిబ్బందిపై విద్యాశాఖ చర్యలు చేపట్టింది. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ ను పరీక్ష విధుల నుంచి తొలగించింది. ఒక ఇన్విజిలేటర్ సుధారాణి ని సస్పెండ్ చేసింది.ఈ లీకేజీకి సంబంధించి నకిరేకల్ మండల విద్యాధికారి ఎం. నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రశ్నాపత్రాన్ని బయటకు తెచ్చిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని నకిరేకల్ ఎంఈఓ ఎం. నాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు..
Read More : ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజగోపాల్ రెడ్డితో పాటు ఈ ఐదుగురికి పక్కా?
మరోవైపు నకరేకల్ లో టెన్త్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంలో తన ప్రమేయం లేదంటోంది విద్యార్థిని. తనకు ఏ పాపం తెలియదని విద్యార్థి బల్లెం ఝాన్సీ లక్ష్మి కన్నీరు కారుస్తోంది.ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న తనను బెదిరించి ఫోటో తీసుకున్నాడని.. పేపర్ చూపించు లేకుంటే రాయితో కొడతానని బెదిరించారని చెబుతోంది. ఆ సమయంలో తనకు భయం వేసిందని.. ఏం చేయాలో అర్థం కాక క్వశ్చన్ పేపర్ చూపించానని తెలిపింది. పక్కన ఉన్నవారు కూడా ఏం కాదులే చూపించమన్నారని వెల్లడించింది. ఇందులో తన ప్రమేయం ఏమి లేదని.. దయచేసి తన డిబార్ ను రద్దు చేయాలని వేడుకుంటోంది ఝాన్సీ లక్ష్మి.ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారని.. దయచేసి ఎగ్జాం రాసే అవకాశం మళ్ళీ కల్పించాలని వేడుకుంటోంది. ఎగ్జామ్ రాయకపోతే తనకు సావే శరణ్యమని రోదించింది విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి