
-
సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ
-
పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం
-
స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ
-
ఉద్యోగాల భర్తీ, కొత్త రేషన్ కార్డుల జారీపై సమాలోచనలు
-
సెప్టెంబర్ 30నాటికి స్థానిక ఎన్నికలు పూర్తిచేయాలని హైకోర్టు ఆదేశం
-
గడువులోపు ఎన్నికలు పూర్తిచేయాలని ప్రభుత్వం సన్నాహాలు
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణలో ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న సర్పంచ్ ఎన్నికలపై ఇవాళ క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన నేడు జరగబోయే కేబినెట్ సమావేశంలో స్థానిక ఎన్నికలపై కీలక నిర్ణయం ఉండబోతున్నట్లు చెబుతున్నారు. గత మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాల అమలులో జాప్యంపై రేవంత్‌రెడ్డి సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.
ఇక, ఇవాళ జరిగే మంత్రివర్గ సమావేశంలో స్థానిక ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, ఉద్యోగాల భర్తీ, రేషన్ కార్డుల జారీ, మహిళల కోసం మరిన్ని పథకాల అమలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే స్థానిక ఎన్నికలపై నిర్వహణపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన ఆదేశాలే మంత్రివర్గ భేటీలో కీలక అంశం కానుంది. ధర్మాసనం సెప్టెంబర్ 30వరకు ఎన్నికలు పూర్తిచేయాలని డెడ్‌లైన్ విధించిన సంగతి తెలిసిందే. ఆలోపు ఎన్నికలు పూర్తిచేయాలంటే తీసుకోవాల్సిన చర్యలు, బ్యాలెట్ పత్రాలముద్రణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
అయితే, పంచాయితీరాజ్ – 2025 చట్టం సవరణ బిల్లును అసెంబ్లీలో రేవంత్ సర్కార్ ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉంది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును రేవంత్ సర్కార్… కేంద్రానికి పంపింది. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర వేస్తేనే 42శాతం రిజర్వేషన్లు అమలయ్యే అవకాశం ఉంది. హైకోర్టు సెప్టెంబర్ 30వరకే గడువిచ్చిన నేపథ్యంలో ఇంత త్వరగా పంచాయితీరాజ్ చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అమలు, స్థానిక ఎన్నికల నిర్వహణ అంశాలే ప్రధాన అంశంగా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది.
కాగా, ఏడాదిన్నరగా గ్రామ పంచాయితీల్లో పాలకవర్గం లేకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. గ్రామాల్లో కనీస వసతులు కల్పించలేక సెక్రటరీలు నానా అవస్థలు పడుతున్నారు. గత సర్పంచ్‌ల కాలంలో చేసిన పనుల బిల్లులు చాలావరకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ తరుణంలో ఎన్నికలు నిర్వహించి, పాత బిల్లులు చెల్లించడం, కొత్త పాలకవర్గానికి నిధులు సమకూర్చడం ఎలా అన్నదానిపై సర్వత్రా చర్చ నడుస్తోంది.