
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో : అమరావతి పునర్‌నిర్మాణ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మోడీ చేతుల మీదుగా అమరావతి రీలాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్‌తోపాటు చాలా మంది ప్రముఖులను ఆహ్వానించారు. జగన్ హాజరుకాలేదు.. అది ఊహించిందే కావొచ్చు. కానీ… చిరంజీవిని ఆహ్వానించినా… హాజరుకాకపోవడం చాలా మందికి మింగుడు పడలేదు. మోడీతో వేదిక పంచుకునే అవకాశం వచ్చినా… మెగాస్టార్ ఎందుకు వదులుకున్నారన్న చర్చ జరుగుతోంది. చిరంజీవి వచ్చుంటే బాగుండేదని కూడా అనుకుంటున్నారు. అయితే… చిరంజీవి గైర్హాజరవడానికి కారణాలు ఉన్నాయని… నెగిటివ్‌గా తీసుకోవద్దని… సోషల్ మీడియోలో ప్రచారం మొదలైంది.
ప్రధాని మోడీ సభకు ఆహ్వానం అందినా చిరంజీవి హాజరుకాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి విషయంలో మొదటి నుంచి చిరంజీవి పాజిటివ్‌గా లేరు. రైతుల నుంచి వేల ఎకరాల భూమిని సేకరించడాన్ని తప్పుబట్టారు కూడా. అంతేకాదు వైఎస్ జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అప్పుడు అలా మాట్లాడి.. ఇప్పుడు అమరావతి పునర్‌నిర్మాణ పనులకు హాజరుకావడం బాగుండదని చిరంజీవి అనుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.
ఏపీలో మోడీ సభకు చిరంజీవి హాజరవుతారని అభిమానులు ఫుల్ కుష్ అయ్యారు. కానీ.. చిరంజీవి రాకపోవడం వారిని నిరాశ పరిచింది. 2024 ఎన్నికల తర్వాత సీఎం, మంత్రుల ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీ హాజరయ్యారు. అప్పుడు చిరంజీవి కూడా వేదికను పంచుకున్నారు. ఆ సమయంలో మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్… ప్రధాని ప్రత్యేకంగా కాసేపు మాట్లాడారు. వారికి ప్రియారిటీ ఇచ్చారు. వైసీపీ హయంలో భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణ జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రధాని మోడీ, చిరంజీవి హాజరయ్యారు. ఆ సభలో వైఎస్ జగన్ కంటే.. చిరంజీవికి ప్రియారిటీ ఇచ్చారు ప్రధాని. చిరంజీవితో ప్రధాని మోడీ అంత సఖ్యతగా ఉండటం.. అభిమానుల్లో ఫుల్ జోష్ నింపింది. అంతేకాదు.. చిరంజీవి బీజేపీలోకి వెళ్లే అవకాశం ఉందని కూడా ప్రచారం జరిగింది. కానీ… ఆ ప్రచారాన్ని మెగాస్టార్ కొట్టిపారేశారు.
మెగా బ్రదర్స్‌కు మోడీ ఇచ్చే ప్రాధాన్యతే వేరు. అలాంటప్పుడు ప్రధాని మోడీతో వేదికను పంచుకునే అవకాశం వస్తే.. చిరంజీవి ఎందుకు వదులుకున్నారన్న ప్రశ్న మొదలవుతోంది. ఆయన కారణాలు ఆయనకు ఉన్నా… కనీసం సోషల్ మీడియాలో అయినా స్పందింస్తారేమో అని అభిమానులు ఎదురుచూశారు. కానీ… అదీ జరగలేదు. దీంతో… ఈసారికి నిరాశ తప్ప మెగా ఫ్యాన్స్ ఏమీ మిగల్లేదు.