
బెంగళూరు నగరంలో చోటు చేసుకున్న ఓ ఘటన సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దేశంలోనే అత్యంత రద్దీగా, ఆధునికతకు ప్రతీకగా చెప్పుకునే చర్చ్ స్ట్రీట్ ప్రాంతంలో ఓ యువకుడు బహిరంగంగా చేసిన అశ్లీల చర్యలు మహిళల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. చర్చ్ స్ట్రీట్‌లో ఓ యువతి తన స్నేహితురాలితో కలిసి ఉండగా, అక్కడికి వచ్చిన ఓ యువకుడు వారి ఎదుట నిలబడి లైంగిక చేష్టలకు పాల్పడ్డాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో యువతులు తీవ్రంగా భయాందోళనకు గురయ్యారు.
View this post on Instagram
యువకుడి ప్రవర్తనను సహించలేని ఆ యువతి వెంటనే తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేసింది. అనంతరం ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఘటన బయటికి వచ్చింది. వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల ఇలాంటి దురాచారాలు కొనసాగుతుండటం సమాజానికి మచ్చగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లోనే కాకుండా పగటి వేళల్లోనూ రద్దీగా ఉండే ప్రాంతాల్లో కూడా మహిళలు భద్రత లేకుండా మారుతున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.
చర్చ్ స్ట్రీట్ లాంటి ప్రముఖ ప్రాంతంలోనే ఇలాంటి ఘటన జరగడం పోలీసు నిఘాపై అనుమానాలు కలిగిస్తోంది. అక్కడ ఎప్పుడూ జనసంచారం ఎక్కువగా ఉంటుందని, పర్యాటకులు, యువత, కుటుంబాలు తిరిగే ప్రాంతమని గుర్తు చేస్తున్నారు. అలాంటి చోట యువకుడు నిర్భయంగా అశ్లీల ప్రవర్తనకు పాల్పడటం చట్టానికి సవాలుగా మారిందని నెటిజన్లు అంటున్నారు. మహిళల గౌరవం, భద్రత విషయంలో పోలీస్ శాఖ మరింత కఠిన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధించే వారిపై తక్షణమే కేసులు నమోదు చేసి శిక్షలు విధించాలని ప్రజలు కోరుతున్నారు. సీసీటీవీ కెమెరాల నిఘా పెంచడం, పెట్రోలింగ్‌ను మరింత కట్టుదిట్టం చేయడం అవసరమని సూచిస్తున్నారు. మహిళలు భయపడకుండా స్వేచ్ఛగా తిరిగే వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటివరకు పోలీసులు అధికారికంగా ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వైరల్ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి చర్యలు తీసుకుంటారా అన్నది వేచి చూడాల్సి ఉంది.
ALSO READ: అమావాస్య వేళ.. ఖననం చేసిన మృతదేహం తల మాయం!





