HomeతెలంగాణChandrababu Naidu: తెలంగాణ సమాజానికి దగ్గరవుతున్న చంద్రబాబు!

Chandrababu Naidu: తెలంగాణ సమాజానికి దగ్గరవుతున్న చంద్రబాబు!

* ఇన్ని రోజులు బాబును చూపి సెంటిమెంట్ రగిలించిన కేసీఆర్

* ఇప్పుడిప్పుడే వాస్తవాలు గ్రహిస్తున్న తెలంగాణ ప్రజలు

* టిడిపి అధినేత పై తగ్గిన ఆగ్రహం

* అందుకే దగ్గరయ్యేందుకు క్యూ కడుతున్న తెలంగాణ నేతలు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణలో వ్యతిరేకత తగ్గుతోందా? అక్కడ ప్రజలు సానుకూలంగా చూస్తున్నారా? అందుకే అక్కడ నేతలు సైతం చంద్రబాబుతో స్నేహం చేసేందుకు ముందుకు వస్తున్నారా? చంద్రబాబు వ్యతిరేకులు ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నేతల తో చంద్రబాబు సఖ్యత గానే గడుపుతున్నారు. వారి ఇళ్లల్లో శుభకార్యాలకు హాజరవుతున్నారు. చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానాలు కూడా పంపుతున్నారు తెలంగాణ ప్రముఖులు. గతం కంటే పూర్తిగా సీన్ మారింది అనిపిస్తోంది తెలంగాణలో…

చంద్రబాబు అరెస్టు సమయంలో..

ఏపీలో చంద్రబాబు అరెస్టు సమయంలో భిన్న పరిస్థితి ఉండేది తెలంగాణలో. అప్పట్లో కెసిఆర్ అధికారంలో ఉండేవారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఐటి ఉద్యోగుల ఆందోళనలకు కూడా అక్కడి ప్రభుత్వం అడ్డు తగిలిందంటే ఏ స్థాయిలో వ్యతిరేకించేదో అర్థమవుతుంది. వాస్తవానికి తెలంగాణ సమాజంలో చంద్రబాబు పై వ్యతిరేకత పెంచడంలో కెసిఆర్ ది కీలక పాత్ర. ఉద్యమం నాటి నుంచి నేటి వరకు కెసిఆర్ చంద్రబాబును ఆడి పోసుకునేవారు. చాలా చులకనగా మాట్లాడేవారు. తెలంగాణను అడ్డుకుంటుంది చంద్రబాబు అని ప్రజలకు వివరించే ప్రయత్నం చేసేవారు. అందుకే తెలంగాణలో టిడిపి తో పొత్తు పెట్టుకునేందుకు కూడా ఏ పార్టీ ముందుకు రాని విధంగా రాజకీయాలు చేశారు కేసీఆర్.

వ్యూహాత్మక మౌనం..

అయితే చంద్రబాబు వ్యూహాత్మకంగా తెలంగాణ విషయంలో చాలా మౌనం పాటిస్తూ వచ్చారు. తెలంగాణ రాజకీయాల గురించి నోరు తెరిచిన దాఖలాలు కూడా లేవు. ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా ఎప్పుడు రెచ్చిపోలేదు. సమయం వచ్చినప్పుడు చెబుదాం అన్నట్టు ఊరుకున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ. 2024 సార్వత్రిక ఎన్నికల్లో సైతం దూరంగా ఉండిపోయింది పోటీకి. తెలంగాణ సమాజంలో చంద్రబాబు అనే బూచి చూపించి కేసిఆర్ రాజకీయాలు చేశారు. కెసిఆర్ పార్టీలో ఉన్న నేతలు సైతం చంద్రబాబు సన్నిహితులే. కానీ ఏం చేయలేని నిస్సహాయత వారిది. అందుకే తెలంగాణ సమాజం కేసీఆర్ను పక్కన పెట్టిన వరకు.. వారంతా చంద్రబాబుపై తమ అభిమానాన్ని చూపించలేకపోయారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలనుంచి కెసిఆర్ కనుమరుగవ్వాల్సిన ప్రమాదం ఏర్పడింది. అందుకే వారంతా ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానిస్తున్నారు. చంద్రబాబు గొప్పతనాన్ని వివరిస్తున్నారు.

వ్యతిరేకం తగ్గింది..

ఇటీవల జరిగిన పరిణామాలు చూద్దాం. హరీష్ రావు లాంటి గులాబీ పార్టీ అగ్రనేత సైతం చంద్రబాబు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. అదే పార్టీకి చెందిన మల్లారెడ్డి చంద్రబాబుపై తనకున్న అభిమానాన్ని దాచుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల గురించి చెప్పనవసరం లేదు. కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అయితే ఏకంగా చంద్రబాబుకు పాదాభివందనం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అయితే అమరావతికి వెళ్లి తన కుమారుడి వివాహానికి ఆహ్వానించారు. తన ఇంటికి వచ్చిన చంద్రబాబును చూసి సంతోషం వ్యక్తం చేశారు. బాబు మోహన్ లాంటి నేతలు అయితే చంద్రబాబుతో సన్నిహితంగా మెలిగేందుకు ముందుకు వస్తున్నారు. కెసిఆర్ పార్టీలో పని చేసిన తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు.. ఇలా ఒక్కరేమిటి అంతా ఇప్పుడు చంద్రబాబుతో స్నేహం కోసం ముందుకొస్తున్నారు. అయితే పరిస్థితులకు తగ్గట్టు నడుచుకునే గుణం చంద్రబాబుది. ఖచ్చితంగా పూర్వపు టీం ఏర్పడితే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments